బుధవారం 25 నవంబర్ 2020
National - Sep 20, 2020 , 17:27:00

జ‌మ్ముక‌శ్మీర్‌లో 17 ల‌క్ష‌ల మందికి నివాస ధృవీకరణ పత్రాలు

జ‌మ్ముక‌శ్మీర్‌లో 17 ల‌క్ష‌ల మందికి నివాస ధృవీకరణ పత్రాలు

ఢిల్లీ : జ‌మ్ముక‌శ్మీర్‌లో ఇప్ప‌టివ‌రకు దాదాపు 17 ల‌క్ష‌ల మందికి నివాస ధృవీక‌ర‌ణ ప‌త్రాలు అంద‌జేసిన‌ట్లు కేంద్ర హోంమంత్రిత్వ‌శాఖ ఆదివారం లోక్‌స‌భ‌కు తెలిసింది. జ‌మ్ముక‌శ్మీర్ ప‌రిపాలనా విభాగం అంద‌జేసిన నివేదిక ప్ర‌కారం హోంశాఖ స‌హాయ మంత్రి జి. కిష‌న్ రెడ్డి ఈ మేర‌కు స‌భ‌కు లిఖిత‌పూర్వ‌క స‌మాధాన‌మిచ్చారు. మొత్తం 21,13,879 మంది నివాస ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వీరిలో 16,79,520 మందికి నివాస ధృవీకరణ పత్రాలు అంద‌జేసిన‌ట్లు చెప్పారు.

నిర్దేశించిన పత్రాలను దరఖాస్తుతో స‌మ‌ర్పించ‌ని కార‌ణంగా 1,21,630 దరఖాస్తులు తిరస్కరించబడిన‌ట్లు వెల్ల‌డించారు. జమ్ముక‌శ్మీర్ గ్రాంట్ ఆఫ్ డొమిసిల్ సర్టిఫికేట్ (ప్రొసీజర్) రూల్స్ 5 దరఖాస్తుతో జతచేయవలసిన కొన్ని పత్రాలను తప్పనిసరి చేస్తుంది. అటువంటి ప‌త్రాల‌కు తిర‌స్క‌ర‌ణ‌కు గురైతున్న‌ట్లు చెప్పారు. జమ్ముక‌శ్మీర్ ప్రావిన్షియల్ రిహాబిలిటేషన్ ఆఫీసర్ (పిఆర్ఓ) వద్ద ఉన్న‌ రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం 1971 నాటి ఇండో-పాక్ యుద్ధంలో మొత్తం 6,565 కుటుంబాలు చాంబ్ నియాబ‌త్‌ ప్రాంతం నుండి నిరాశ్ర‌యులైన‌ కుటుంబాలుగా నమోదు చేయబడ్డాయన్నారు.

1971 నాటి నిరాశ్రయులైన కుటుంబాలకు సాగుభూమి 4 ఎకరాలు లేదా నీటివ‌స‌తిలేని వ్య‌వ‌సాయ‌ భూమి 6 ఎకరాల చొప్పున కేటాయించారు. అదేవిధంగా ప్రతి కుటుంబానికి రూ. 7,500 నగదు పరిహారం కూడా చెల్లించినట్లు తెలిపారు. 1947 నాటి ఇండో-పాక్ యుద్ధం కారణంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్ముక‌శ్మీర్ నుండి మొత్తం 31,619 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయన్నారు. అందులో 26,319 కుటుంబాలు రిజిస్టర్ అయిన‌ట్లు ఈ కుటుంబాల‌న్నీ పూర్వపు జమ్ముక‌శ్మీర్ రాష్ట్రంలో స్థిరపడ్డాయని చెప్పారు. జమ్ముక‌శ్మీర్ ప్రావిన్షియల్ రిహాబిలిటేషన్ ఆఫీసర్ వ‌ద్ద రిజిస్టర్ అయిన మొత్తం 5,300 కుటుంబాలు అనంత‌ర కాలంలో దేశంలోని ఇతర ప్రాంతాలకు వ‌లస వెళ్లిన‌ట్లు పేర్కొన్నారు.