జైపూర్, నవంబర్ 3: రాజస్థాన్‌లో ఐదేండ్ల కాం గ్రెస్ పాలనలో అవినీతి, ధరలు, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయాయని మెజారిటీ ఓటర్లు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నిరుద్యోగం, ధరల పెరుగుదల సమస్యలను ప్రథమ, ద్వితీయ ప్రాధమ్యాలుగా వారు భావిస్తున్నారు. ఎన్డీ టీవీ-సీఎస్డీఎస్ లోక్‌నీతి జరిపిన ప్రీ పోల్ సర్వేలో రాజస్థాన్ ప్రజలు పేదరికం, అభివృద్ధి లేమికి మూడు, నాలుగో ప్రాధాన్యతను ఇవ్వగా అవినీతి అంశం తీవ్ర సమస్యని కేవలం 7% మాత్రమే భావించారు.
ఆశ్చర్యకరంగా ఐదేళ్ల గెహ్లాట్ పాలనలో ధరలు బాగా పెరిగిపోయాయని 72%, అవినీతి పేరుకుపోయిందని 54% మంది అభిప్రాయపడ్డారు. 40% మాత్రం రాష్ట్రంలో ఎదుర్కొంటున్న నిరుద్యోగంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 30 అసెంబ్లీ స్థానాల్లో మూడు వేల మందిని అక్టోబర్ 24 నుంచి వారం పాటు ప్రశ్నించి ఈ సర్వే నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దవాఖానలు, స్కూళ్లకు ప్రశంసలు దక్కగా, చాలా విషయాల్లో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం మీద కాంగ్రెస్, ముఖ్యమంత్రి రాష్ర్టానికి చేయాల్సింది ఇంకా ఉందని పలువురు అభిప్రాయ పడ్డారు.