ముంబై : ముంబైలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో జరిగిన ఓ సంఘటన దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. జూన్ 4న కౌంటింగ్ రోజు ముంబై వాయువ్య నియోజకవర్గ ఎన్డీయే అభ్యర్థి రవీంద్ర వైకర్ బావమరిది మంగేశ్ పందిల్కర్ చేతిలో మొబైల్ ఫోన్ ఉన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇది ఎన్నికల అధికారి ఫోన్ అని, దీనికి వచ్చిన ఓటీపీతోనే ఈవీఎంను అతడు అన్‌లాక్ చేశాడని ఒక ఆంగ్ల పత్రికలో సంచలన కథనం ప్రచురితమైంది.ఈవీఎంల వినియోగంపై దేశంలో చర్చ జరుగుతున్న వేళ ప్రచురితమైన ఈ వార్తతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ వ్యవహారం చోటు చేసుకున్న ముంబై వాయువ్య లోక్‌సభ నియోజకవర్గంలో కేవలం 48 ఓట్ల మెజారిటీతో ఎన్డీయే బలపర్చిన శివసేన(ఏక్నాథ్ షిండే) అభ్యర్థి రవీంద్ర వైకర్ గెలిచారు. దీంతో ఇది మరింత అనుమానాలకు తావిచ్చింది.
ఈ వ్యవహారంపై ముంబై వాయువ్య నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వందన సూర్యవంశీ స్పందించారు. ఈవీఎంలను అన్‌లాక్ చేయడానికి ఓటీపీ అవసరం లేదన్నారు. కౌంటింగ్ చేయడానికి ఓటీపీ అవసరం లేదని, డాటా ఎంట్రీ చేయడానికి మాత్రం అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఓటీపీ వస్తుందని తెలిపారు.జోగేశ్వరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన డాటా ఎంట్రీ ఆపరేటర్ దినేశ్ గురవ్ వ్యక్తిగత ఫోన్ మాత్రం ఒక అనధికార వ్యక్తి దగ్గర లభించిందని పేర్కొన్నారు. ఇండియా కూటమి పార్టీల నేతలు ఈ వార్తను జతచేసి సోషల్ మీడియా వేదికగా ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేశారు.