శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Nov 10, 2020 , 11:23:57

నితీశ్‌కే జ‌న‌నీరాజ‌నం.. !

నితీశ్‌కే జ‌న‌నీరాజ‌నం.. !

హైద‌రాబాద్‌:  బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కే ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు మ‌ళ్లీ ప‌ట్టం క‌ట్ట‌బోతున్నారు.  ఇవాళ జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ స‌ర‌ళి.. నితీశ్‌కు మ‌రోసారి ప‌గ్గాల‌ను అందించేలా క‌నిపిస్తున్న‌ది.  ఎన్డీఏ ద‌ళం 129 స్థానాల్లో దూసుకువెళ్తున్న‌ది.  ఎగ్జిట్స్ పోల్స్‌లో నితీశ్‌కు అధికారం ద‌క్క‌డం క‌ష్ట‌మే అని తేల్చినా.. ఓట‌ర్లు మాత్ర‌మే జేడీయూ చీఫ్‌కే చీర్స్ కొట్టిన‌ట్లు తెలుస్తోంది.  ఇవే నా చివ‌రి ఎన్నిక‌లంటూ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ప్ర‌క‌టించి కొత్త త‌ర‌హా రాజ‌నీతికి తెర‌లేపిన నితీశ్‌నే మ‌ళ్లీ బీహారీలు ఎన్నుకున్న‌ట్లు సంకేతాలు అందుతున్నాయి.  ఎన్డీఏ కూట‌మి అద్భ‌త ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చింది.  మ‌హాగ‌ట్‌బంద‌న్ కూడా మెరుగ్గానే రాణిస్తున్న‌ది. తాజా స‌మాచారం ప్ర‌కారం .. 95 స్థానాల్లో మ‌హాగ‌ట్‌బంద‌న్ విజ‌యం దిశ‌గా వెళ్తోంది.  ఇక లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ కూడా ఏడు స్థానాల్లో విక్ట‌రీ వైపు వెళ్తోంది.  

తాజా ఫ‌లితాల‌తో .. బీహార్‌లో బీజేపీ పుంజుకున్న‌ట్లు తెలుస్తోంది.  మ‌హాగ‌ట్‌బంద‌న్ నుంచి ఎన్డీఏ వైపు ఫ‌లితాలు మ‌ళ్లుతున్న తీరు ఆస‌క్తిని రేపుతున్నాయి.  కానీ ఈ ఫలితాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని బీజేపీ భావిస్తున్న‌ది.  వాస్త‌వానికి బీహార్‌లో జేడీయూ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు.  ఎన్డీఏ కూట‌మిలో జేడీయూ, బీజేపీలు ఉన్నా.. ఇక సీఎం స్థానాన్ని నితీశే కైవ‌సం చేసుకుంటారా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. కానీ సీఎం అభ్య‌ర్థిగా నితీశ్‌కే బీజేపీ ఛాన్స్ ఇవ్వ‌డంతో.. ఈ రెండు పార్టీలు క‌లిసి ఈసారి మ‌ళ్లీ బీహార్‌ను చేజిక్కించుకునే దిశ‌గా వెళ్తున్నాయి.   ప్ర‌స్తుతం కౌంటింగ్ కొన‌సాగుతున్న‌ది.  అయితే మ‌ధ్యాహ్నం దాటితే కానీ.. తుది ఫ‌లితాలు ఎలా ఉంటాయో అంచ‌నా వేయ‌లేమ‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. 

అయితే మొద‌టిసారి బీహార్‌లో తొలిసారి బీజేపీ పార్టీ అత్య‌ధిక స్థానాలు గెలుచుకోనున్న‌ది.  మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, యూపీ, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్ రాష్ట్రాల్లో గ‌తంలో బీజేపీ హ‌వా కొన‌సాగించినా.. బీహార్‌లో ఎప్పుడూ ఆ పార్టీకి ఎదురు త‌గిలేది. కానీ ఈ సారి బీహార్‌లో అనూహ్య రీతిలో బీజేపీ ముంద‌కు వ‌చ్చింది.  అయితే ప్ర‌స్తుతానికి బీహార్‌లో కేవ‌లం నాలుగు రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. ఇంకా చాలా రౌండ్లు లెక్కించాల్సి ఉన్న‌ది. అందుకే తుది ఫ‌లితాల వ‌ర‌కు వేచి వుండాల్సిందే అన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.