ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ మలుపులు తిరిగాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్ పవార్ (Ajit Pawar) మళ్లీ తిరుగుబాటు చేశారు. ఆదివారం ఉదయం అధికారిక నివాసం ‘దేవగిరి’లో తనకు మద్దతుగా ఉండే ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్, ధనంజయ్ ముండే, దిలీప్ వాల్సే పాటిల్, తదితర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం అజిత్ పవార్ సుమారు 9 మంది ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఆయన చేరారు. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
కాగా, పూణేలో ఉన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఈ పరిణామాల గురించి తనకు ఏమీ తెలియదని చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన అజిత్ పవార్, పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించవచ్చని తెలిపారు. మరోవైపు అసెంబ్లీ ప్రతిపక్ష నేత పదవి తనకు వద్దని అజిత్ పవార్ ఇటీవల పార్టీ అధిష్ఠానానికి స్పష్టం చేశారు. తనకు పార్టీలో ఏదైనా పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే చాలా రోజులుగా ఎన్సీపీ సమావేశాలకు దూరంగా ఉంటున్న ఆయన బీజేపీతో కలిసి మళ్లీ జతకట్టవచ్చన్న ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఆదివారం దీనిని నిజం చేశారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్, తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరారు.