ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ సర్కార్ అధికార దాహానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) బలైంది. మహారాష్ట్రలో షిండే-బీజేపీ సర్కారుపై ప్రజా వ్యతిరేకత పెరగడం.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చెప్పుకోదగ్గ సీట్లు రావన్న భావన నెలకొనడంతో.. బీజేపీ అధిష్ఠానం సరికొత్త కుట్రలకు తెర లేపింది. అజిత్ పవార్ వర్గానికి పదవుల వల విసిరి తన పంచన చేర్చుకొంది. ఎన్సీపీ ముఖ్య నేతలు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్ ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసిన కొద్ది నెలల్లోనే అజిత్ వర్గం వచ్చి బీజేపీతో చేతులు కలపడం గమనార్హం.
NCP | ముంబయి, జూలై 2: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) కీలక నేత అజిత్ పవార్ అధికార పక్షంలో చేరారు. ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్‌కు తెలియకుండా..పార్టీలోని కీలక నేతల్ని వెంట తీసుకెళ్లిన ఆయన షిండే-బీజేపీ సర్కార్‌తో జతకట్టారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో భేటీ అనంతరం, తన మద్దతుదారులు 9 మంది వెంటరాగా..గవర్నర్ రమేశ్ బియాస్‌ను కలిశారు. వెనువెంటనే మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, ధర్మారావ్ అట్రాం, సునీల్ వాల్సడే, అదితి ఠాక్రే, హసన్ ముష్రీఫ్, ధనుంజయ్ ముండే, అనిల్ పాటిల్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో విడిగా అజిత్ పవార్ తన ఇంట్లో సమావేశం నిర్వహించగా, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే సహా పలువురు ఎన్సీపీ నాయకులు పాల్గొన్నారు.
సమావేశం నుంచి సుప్రియా అర్ధాంతరంగా వెళ్లిపోయారు. అనంతరం అజిత్ పవార్ రాజ్‌భవన్‌కు తరలివెళ్లగా, సీఎం ఏక్నాథ్ షిండే సైతం అక్కడికి చేరుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నట్టు అజిత్ ప్రకటించిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవటం గమనార్హం. మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి ప్రస్తుతం 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో దాదాపు 30 మంది అజిత్ పవార్ వెంట ఉన్నారని సమాచారం. అజిత్ పవార్ నిర్ణయాన్ని సీఎం ఏక్నాథ్ షిండే స్వాగతించారు. తాజా పరిణామాలు విపక్ష కూటమికి మింగుడు పడటం లేదు. బీజేపీతో అజిత్ పవార్ చేరుతారని ముందే ఊహించామని శివసేన(యూబీటీ వర్గం) అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ‘అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చెప్పిన ప్రజాస్వామ్యం బహుశా ఇదేనేమో!’ అంటూ కపిల్ సిబల్ ఎద్దేవా చేశారు.
నాలుగేండ్లలో మూడుసార్లు
ప్రస్తుత అసెంబ్లీలో..అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవి దక్కటం మూడోసారి. తొలుత 2019లో ఫడ్నవీస్ సర్కార్‌లో, రెండోసారి.. ఉద్ధవ్ ఠాక్రే సర్కార్‌లో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఇప్పుడు ఎన్సీపీని మళ్లీ చీల్చి బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఎన్సీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు తమ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని, పార్టీ గుర్తు, పేరు కోసం పోరాటం చేస్తామని ప్రమాణ స్వీకారం అనంతరం అజిత్ పవార్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
త్వరలో నిజం బయట పడుతుంది : పవార్
ఈడీ కేసులు, బెదిరింపు రాజకీయాలే ఎన్సీపీలో సంక్షోభానికి కారణమని పార్టీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలపటంపై ఆయన మండిపడ్డారు. ‘ఇది పార్టీని దోపిడి చేయటం. ఇలాంటివి జరిగిన ప్రతిసారి పార్టీని నిలబెట్టుకున్నా. ఈడీ దాడులు, బెదిరింపులు కొంతమంది నాయకుల్ని ప్రభావితం చేసింది. నిజం ఏంటన్నది అతి త్వరలో బయటకు వస్తుంది. బీజేపీ వైపు పోయిన వారి భవిష్యత్తు గురించి చింతిస్తున్నా’ అని చెప్పారు. తాజా పరిణామాలపై జూలై 5న తమ పార్టీ సమావేశం కానున్నదని పవార్ చెప్పారు.
ఇక మోదీకి ఎన్సీపీ అవినీతి కనపడదు
ప్రధాని మోదీ రెండు నాల్కల ధోరణికి ఇదొక ఉదాహరణ. ఎన్సీపీ నేతల అవినీతిపై ఎన్నో ఆరోపణలు చేసిన మోదీకి, ఇక నుంచి ఆ పార్టీ నాయకుల అవినీతి కనపడదు.
-టీఎంసీ నాయకుడు బాబుల్ సుప్రియో
అవినీతిని పోషిస్తున్నది ప్రధాని మోదీయే
దేశంలో అవినీతిని పెంచి పోషిస్తున్నది ప్రధాని మోదీయే. అవినీతిపై పోరాటం చేస్తామని ప్రసంగించిన ప్రధాని మోదీ, మహారాష్ట్రలో అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు.
-ఆప్ ఎంపీ సంజయ్ సింగ్