ముంబై : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మహారాష్ట్రకు చేరుకోగానే యాత్రకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్వాగతం పలుకుతారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో రాహుల్ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం బీజేపీ పాలిత కర్నాటకలోని చిత్రదుర్గ మీదుగా సాగుతోంది.
రాహుల్ పాదయాత్ర నవంబర్ తొలివారంలో మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో ఎనిమిది జిల్లాల పరిధిలోని 380 కిలోమీటర్ల మీదుగా సాగుతుందని సీఎల్పీ నేత, మాజీ మంత్రి బాలాసాహెబ్ థొరట్ తెలిపారు.
రాహుల్ పాదయాత్ర సందర్భంగా రాష్ట్రంలో పది చోట్ల బహిరంగ సభలు ఉంటాయని చెప్పారు. ఇక కర్నాటకలో రాహుల్ పాదయాత్రలో బాగంగా అక్టోబర్ 15న బళ్లారిలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.