న్యూఢిల్లీ: పార్టీలో అజిత్ పవార్ ప్రాధాన్యతను తగ్గిస్తూ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సంచలన ప్రకటన చేశారు. కుమార్తె సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశానికి అజిత్ పవార్, ఛగన్ భుజ్‌బల్, సునీల్ తర్కురే, ఫౌజియా ఖాన్..తదితర సీనియర్ నేతలు హాజరుకాగా, వారి సమక్షంలో శరద్ పవార్ తన నిర్ణయాన్ని వెల్లడించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
అంతేగాక సుప్రియా సూలేని పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చీఫ్‌గా కూడా నియమించారు. దీంతోపాటుగా మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ రాష్ర్టాలకు ఇన్చార్జ్ బాధ్యతల్ని, పార్టీ మహిళా, యువత, విద్యార్థి విభాగాలను సైతం ఆమె చేతికే అప్పగించారు. ప్రఫుల్ పటేల్‌ను మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ర్టాల ఇన్చార్జ్గా నియమించారు.