ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య 25 నిమిషాల వరకూ చర్చలు జరిగాయి. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో వీరిద్దరి చర్చలు జరిగాయి. గత యేడాది జూలై 17 న వీరిద్దరూ కలుసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే కలుసుకున్నారు. మహా వికాస్ అగాఢీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగడం, రౌత్ టార్గెట్గా ఈడీ దాడుల నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే వీరిద్దరి మధ్యా ఏ ఏ విషయాల్లో చర్చలు జరిగాయన్నది మాత్రం తెలిసి రావడం లేదు. రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న వేళ… వాటి గురించి ఏమైనా చర్చించి వుంటారా? అన్నది అందరూ ఊహించుకుంటున్నారు.
ఈ విషయంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అగ్రనేత అజిత్ పవార్ స్పం దించారు. మోదీ, పవార్ భేటీ అయిన మాట నిజమేనని, అయితే వారేం మాట్లాడుకున్నారన్నది మాత్రం తనకు తెలియదని అన్నారు. ఇద్దరూ కలుసుకున్నప్పుడు దేశ రాజకీయాలతో పాటు మహారాష్ట్ర రాజకీయం కూడా చర్చకు వచ్చే వుంటుందని అజిత్ పవార్ అన్నారు.