న్యూఢిల్లీ, జూలై 29: విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి, అభ్యసనను ఆహ్లాదకరంగా, ప్రయోగాత్మకంగా మార్చడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించాలని నిర్ణయించింది. 6-8 తరగతులకు విద్యా సంవత్సరంలో 10 రోజులు బ్యాగ్‌లెస్ డేస్ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్సీఈఆర్టీ అనుబంధ సంస్థ అయిన పీఎస్ఎస్ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ విధానం ద్వారా కేవలం పుస్తకాల బరువును తగ్గించడమే కాకుండా కేవలం పుస్తకాల ద్వారానే జ్ఞానసముపార్జన అన్న విధానానికి భిన్నంగా వారిని అనుభవపూర్వక పనివిధానంలో భాగస్వాములను చేస్తారు. ఆ రోజుల్లో విద్యార్థులు తమ కిష్టమైన చేతి వృత్తులు కార్పెంటరీ, ఎలక్ట్రిక్, తోటపని, కుండల తయారీ, వంటలు, గాలిపటాల తయారీ, వాటి ఎగరవేత, పుస్తకాల ప్రదర్శన ఇలా తమకిష్టమైన పనులు చేయవచ్చు. ఈ పీరియడ్లలో ఆయా రంగాల్లో నిపుణులైన వ్యక్తులను రప్పించి విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇవ్వడమే కాక, వారికి ఆ పనిలో సహాయపడతారు. ఈ బ్యాగ్ రహిత దినాలు విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా ఉండవచ్చు. అయితే రెండు మూడు విడతలుగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.