న్యూఢిల్లీ: మోసగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) అభ్యర్థులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) శుక్రవారం హెచ్చరించింది. సొమ్ము చెల్లిస్తే, ప్రశ్నా పత్రాన్ని ఇస్తామని హామీ ఇస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా మోసగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది.
ఈ పరీక్ష శనివారం జరుగుతుందని, దీనికి సంబంధించిన ప్రశ్నా పత్రం ఇంకా తయారీ దశలోనే ఉందని చెప్పింది. 50 నగరాల్లోని 71 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. మన దేశంలో మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలంటే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించవలసి ఉంటుంది.
పాము కాటేస్తే కొరికి చంపేశాడు!
పాట్నా: పాము కాటేస్తే.. తిరిగి దాన్ని కొరికి చంపేశాడో వ్యక్తి. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. నవాడాలోని రాజౌరీ ప్రాంతానికి చెందిన సంతోష్ లోహర్‌కు పాము కాటేసింది. వెంటనే దాన్ని పట్టిన సంతోష్.. మూడు సార్లు కొరికాడు. దాంతో ఆ పాము అక్కడికక్కడే చనిపోయింది. అలా ఎందుకు చేశావని అతడిని ప్రశ్నిస్తే.. పాము కుడితే, తిరిగి దాన్ని రెండు సార్లు కరిస్తే విషం ప్రభావం ఉండదని తమ గ్రామంలో నమ్ముతామని తెలిపాడు. ఆశ్చర్యకరంగా సంతోష్ ప్రమాదం నుంచి బయటపడగా, పాము ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలిసిన సమీప గ్రామాల ప్రజలు సంతోష్‌ను చూసేందుకు దవాఖానకు పోటెత్తారు.