చండీగఢ్, అక్టోబర్ 17: హర్యానా ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ఓబీసీ నేత నాయబ్ సింగ్ సైనీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. వాల్మీకి జయంతి రోజున పంచకులలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయబ్ సింగ్, కొందరు మంత్రులతో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.
ముఖ్యమంత్రి హిందీలో, మిగిలిన వారు ఇంగ్లిష్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ, జేపీ నడ్డా, చిరాగ్ పాశ్వాన్‌తో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బీజేపీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు, పలువురు ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో హర్యానాను శరవేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ తెలిపారు.