Haryana Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య డైలాగ్ వార్ క్లైమాక్స్‌కు చేరింది. పాలక బీజేపీపై కాంగ్రెస్ తీవ్రస్ధాయిలో విమర్శలతో విరుచుకుపడుతుంటే కాంగ్రెస్ అవినీతి కుంభకోణాలమయమని కాషాయ నేతలు ఆరోపిస్తున్నారు. హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో మరోసారి బీజేపీ పాగా వేస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే రాష్ట్ర ప్రజలు మార్పు కోరుతున్నారని ఈసారి కాంగ్రెస్‌కు పట్టం కడతారని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఇక హరియాణ సీఎం నయాబ్ సింగ్ సైనీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ధీమాగా ఉన్నారు. కైథాల్‌లో సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాంగ్రెస్ డీఎన్ఏ దెబ్బతిన్నదని, ఈ దేశాన్ని చీల్చాలని, బలహీనపరచాలని కోరుకునే వారికి ఆ పార్టీ వత్తాసు పలుకుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. ఇక హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదని కేంద్ర మంత్రి, హరియాణ మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు.
కాంగ్రెస్‌తో పొత్తుకు ఏ పార్టీ ముందుకు రావడం లేదని చెప్పారు. రిజర్వేషన్లు, సిక్కులపై కాంగ్రెస్ నేతలు అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. హరియాణ సీఎం నయబ్ సింగ్ సైనీ నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని అన్నారు. హరియాణలోని ఝజర్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిజర్వేషన్ల తొలగింపుపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికాలో చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఆలోచనలు బట్టబయలయ్యాయని అన్నారు. విదేశీ గడ్డపై రాహుల్ గాంధీ దేశాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటుగా మారిందని మండిపడ్డారు.
Read More :