ముంబై: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్‌ను మార్చి 21 వరకు జ్యుడీషియల్ కస్టడీకి ముంబై ప్రత్యేక కోర్టు అప్పగించింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఫిబ్రవరి 23న మాలిక్ ఇంటికి వెళ్లారు. పలు గంటలపాటు ఆయనను ప్రశ్నించారు. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్ మాలిక్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ప్రత్యేక కోర్టులో ఆయనను ప్రవేశపెట్టిన ఈడీ, 14 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని కోరింది.
నవాబ్ మాలిక్‌ను తొలుత మార్చి 3 వరకు ఈడీ కస్టడీకి అప్పగించిన కోర్టు అనంతరం దీనిని మార్చి 7 వరకు పొడిగించింది. ఈడీ కస్టడీ ముగియడంతో మంత్రి నవాబ్ మాలిక్‌ను ప్రత్యేక కోర్టులో సోమవారం హాజరుపర్చారు. ఈ కేసుపై విచారణ సందర్భంగా ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఈడీ డిమాండ్ చేసింది. దీంతో మార్చి 21 వరకు జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అప్పగించింది.
కాగా, ఈడీ అరెస్ట్‌కు భయపడబోనని, దీనిపై న్యాయ పోరాటం చేస్తానని మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ గత వారం ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ తనను అక్రమంగా అరెస్ట్ చేసిందని ఆరోపించారు. ఆయన పిటిషన్‌పై ఈడీ స్పందన కోరిన హైకోర్టు తదుపరి విచారణను మార్చి 7కు వాయిదా వేసింది. దీంతో మాలిక్ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో సోమవారం విచారణ జరుగనున్నది.