కోల్‌కతా : ప్రభుత్వ రంగ కంపెనీ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) లిమిటెడ్ గురువారం భారత నావికా దళానికి అడ్వాన్స్డ్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ హిమగిరిని అందజేసింది. నావికా దళం చేపట్టిన ప్రాజెక్ట్ 17ఏలో ఇటువంటి మూడు యుద్ధ నౌకలను జీఆర్ఎస్ఈ నిర్మిస్తున్నది. వీటిలో మొదటి యుద్ధ నౌకను గురువారం అందజేసినట్లు జీఆర్ఎస్ఈ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ యుద్ద నౌకను నావికా దళం తరపున ఈస్టర్న్ నావల్ కమాండ్, చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (టెక్నికల్) రియర్ అడ్మిరల్ రవ్నీష్ సేఠ్ స్వీకరించారు.
149 మీటర్ల పొడవు గల 6,670 టన్నుల ఈ యుద్ధ నౌకలు జీఆర్ఎస్ఈ నిర్మిస్తున్న అత్యంత భారీ నౌకలు, అత్యాధునిక గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్స్ అని వివరించారు. ఈ మూడు యుద్ధ నౌకల విలువ రూ.21,833.36 కోట్లు అని చెప్పారు. ఈ నౌకల నిర్మాణం 2020 డిసెంబరు 14న ప్రారంభమైంది. వీటిలో నౌకలను ధ్వంసం చేయగలిగే బ్రహ్మోస్, ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్, బారక్ 8 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్స్ ఉంటాయి. నావికా దళ దాడులు, రక్షణ సామర్థ్యాలలో ఇది గొప్ప ముందడుగు అని ఓ ప్రకటనలో ఈ అధికారి వివరించారు. గగనతల, ఉపరితల, జలాంతర్గాములను ధ్వంసం చేసే సత్తా వీటికి ఉందన్నారు. కోల్‌కతా కేంద్రంగా పని చేస్తున్న జీఆర్ఎస్ఈ నిర్మించిన 112వ యుద్ధ నౌక హిమగిరి అని తెలిపారు.