న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ‘ప్రపంచ స్థాయి పోటీల్లో పతకాలు తెచ్చిన అత్యున్నత అథ్లెట్లు ఇప్పుడు రోడ్డుపై నిలబడి న్యాయం కావాలని అభ్యర్థిస్తున్నారు. దేశ ప్రజలంతా వారికి అండగా నిలవాలి’ అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలంటూ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టిన రెజ్లర్లను ఆయన శనివారం కలిసి మద్దతు ప్రకటించారు. అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు తెచ్చి దేశానికి గర్వకారణంగా నిలిచిన వీరు వారం నుంచి న్యాయం కోసం జంతర్ మంతర్ వద్ద పోరాడుతున్నారు.
బీజేపీకి చెందిన ఒక పెద్ద నేత వీరిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ అన్యాయంపై నిలదీద్దాం. బీజేపీ ఎంపీ కూడా అయిన బ్రిజ్ భూషణ్‌పై చేస్తున్న పోరాటంలో వారికి అండగా నిలుద్దాం’ అని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. రైతు నేత రాకేశ్ టికాయత్, మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్, సీపీఎం నేత బృందా కారత్, హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్, రెజ్లర్ల సొంత రాష్ర్టాలకు చెందిన అభిమానులు, నేతలు మద్దతు ప్రకటించి, దీనిపై వెంటనే స్పందించాలని మోదీ ప్రభుత్వాన్ని కోరారు.
బ్రిజ్‌భూషణ్‌ను కాపాడటానికి తాపత్రయం ఎందుకు?: ప్రియాంక
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ జంతర్ మంతర్ వద్ద భారత మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్‌ను కలిసి మాట్లాడారు. బ్రిజ్‌భూషణ్‌పై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీలను చూపించాలని ఆమె ఢిల్లీ పోలీసులను డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశించి ‘దేశానికి పతకాలు తెచ్చినప్పుడు వీరిని మీ ఇంటికి పిలిచారు. నిజంగా వీరిపై కనుక మీకు జాలి, సానుభూతి ఉంటే వీరిని వెంటనే పిలిచి మాట్లాడండి. వారంతా మన ఆడపిల్లలే కదా!’ అని వెల్లడించారు.