ముంబై: మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ ఎస్పీ) అధినేత శరద్ పవార్‌కు (Sharad Pawar) కేంద్ర ప్రభుత్వం అత్యున్నత భద్రత కల్పించింది. మాజీ కేంద్ర మంత్రి, మాజీ సీఎం అయిన 83 ఏళ్ల వయస్సున్న ఆయనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించింది. పలువురు వీఐపీల భద్రతను కేంద్ర భద్రతా సంస్థలు బుధవారం సమీక్షించాయి. ఈ నేపథ్యంలో శరద్ పవార్ భద్రతను జెడ్ ప్లస్‌కు పొడిగించాలని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. 55 మంది సాయుధ సీఆర్పీఎఫ్ సిబ్బందిని ఆయన భద్రతకు కేటాయించాలని పేర్కొంది. సీఆర్పీఎఫ్ వీఐపీ సెక్యూరిటీ వింగ్ ద్వారా ఈ మేరకు రక్షణ కల్పించాలని కేంద్ర హోంశాఖ బుధవారం సిఫార్సు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కాగా, ప్రముఖ వ్యక్తులకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ద్వారా భద్రత కల్పిస్తారు. వారి స్థాయి, వారికి వాటిల్లే ముప్పును అనుసరించి వీఐపీ భద్రతా కవర్‌ను జెడ్, వై, ఎక్స్ కేటగిరీలుగా వర్గీకరిస్తారు. వీవీఐపీలకు అత్యధిక సెక్యూరిటీ కింద జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తారు.