పాట్నా, సెప్టెంబర్ 2: అవినీతిపరులపై కేంద్రం తీసుకుంటున్న చర్యలతో రాజకీయాల్లో కొత్త కలయికలు చోటుచేసుకుంటున్నాయని, అవినీతిపరులను రక్షించేందుకు కొందరు బహిరంగంగా ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ గురువారం కేరళ పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు బీహార్ సీఎం నితీశ్ కౌంటర్ ఇచ్చారు. అవినీతిపరులను ఎవరూ రక్షించట్లేదని, ఇతర రాష్ర్టాల్లో ఏం జరుగుతుందో బీజేపీ ఆలోచన చేయాలన్నరు. గతంలో ఎవరిపై అవినీతి ఆరోపణలు చేశారో.. వారితోనే బీజేపీ జతకట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలని మోదీకి హితవు పలికారు. ప్రధానిగా వాజ్పేయీ ఉన్నప్పుడు కలిసి పనిచేసే అవకాశం తనకు వచ్చిందని, ఇప్పుడు బీహార్లో కూడా అలాగే పనిచేసుకుంటూ పోతున్నానని పేర్కొన్నారు.