(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్వుతూ రోజుకో వివాదం సృష్టిస్తున్న ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ప్రసంగ పాఠాన్ని మారుస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తించడం, సభా మర్యాదను విస్మరిస్తూ వాకౌట్ చేయడం, పొంగల్ ఆహ్వాన పత్రికలో రాష్ట్రప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని ముద్రించకపోవడం, తమిళనాడు పేరును ‘తమిళగం’గా పేర్కొనడం వంటి గవర్నర్ చర్యలపై రాజ్యాంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ ప్రవర్తనపై జాతీయ మీడియా కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. రవి ఏకపక్ష తీరును ప్రముఖ ఇంగ్లిష్ పత్రికలు తమ సంపాదకీయాల్లో ఎండగట్టాయి.
రెచ్చగొట్టే చర్య: డెక్కన్ హెరాల్డ్
తమిళనాడు గవర్నర్ తన పరిధి దాటి ప్రవర్తించి, బాధ్యతలను విస్మరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ పాఠంలో మార్పులు, చేర్పులు చేయడానికి గవర్నర్‌కు ఎలాంటి అధికారం లేదు. తనకు నచ్చిన వ్యాఖ్యలను ప్రసంగంలో జోడించడం ముమ్మాటికీ తప్పే. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రప్రభుత్వాలపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. ఇది సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధం. గవర్నర్ రెచ్చగొట్టే చర్యలు ఇందులో భాగమే.
ఘర్షణాత్మక ధోరణి సరికాదు: ది హిందూ
ప్రసంగ పాఠంలో మార్పులను గుర్తించిన సీఎం స్టాలిన్.. దీనిపై అభ్యంతరం తెలియజేయగానే గవర్నర్ సభ నుంచి వెళ్లిపోయారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారికి ఇలాంటి ఘర్షణాత్మకమైన ధోరణి సరికాదు. ఇదే సమయంలో ఆధిపత్యం ఉన్నదని మితిమీరి ప్రవర్తించి.. బాధ్యతలు విస్మరించొద్దు. ఆర్ఎన్ రవి తాజా ప్రవర్తన గవర్నర్ విధులను పునఃసమీక్షించుకొనేలా చేసింది.
ఆ విజ్ఞత ఏది?: టైమ్స్ ఆఫ్ ఇండియా
తమిళనాడు గవర్నర్ ప్రవర్తన రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసేలా ఉన్నది. కేంద్రం-రాష్ర్టాల మధ్య సత్సంబంధాలకు గవర్నర్ వారధిగా పనిచేయాలి. పోలీసుశాఖ, ఐబీలో విధులు నిర్వహించిన ఆర్ఎన్ రవి ఈ సందర్భంలో విజ్ఞతను ప్రదర్శించలేకపోయారు. శాసన వ్యవహారాల్లో గవర్నర్ పరిధి పరిమితమేనని సుప్రీంకోర్టు సైతం చెప్పినప్పటికీ, ఆయన అవేం పట్టించుకోలేదు.
బీజేపీకి ఊహించని షాక్: ఇండియన్ ఎక్స్‌ప్రెస్
ఆర్ఎన్ రవి వైఖరి రాజ్‌భవన్ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా ఉన్నది. కేంద్రప్రభుత్వం నియమించిన ఈ గవర్నర్ ప్రవర్తించిన తీరుపై తమిళ ప్రజలు గుర్రుగా ఉన్నారు. పరోక్షంగా ఇది కేంద్రంలోని బీజేపీకి నష్టదాయకమే. తమిళనాడులో పార్టీని విస్తరించాలనుకొంటున్న కమలదళం పెద్దలకు తాజా పరిణామం ఊహించని షాక్‌గా చెప్పొచ్చు.
రాష్ట్రం కాదు.. కేంద్రం పక్షాన నిలవండి ఐఏఎస్ అభ్యర్థులకు గవర్నర్ రవి సూచన
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వరుస వివాదాలతో వార్తల్లోకెక్కుతున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు ఏర్పడితే.. కేంద్రం పక్షానే నిలవాలంటూ ఐఏఎస్ అభ్యర్థులకు ఆయన సూచించడం తాజాగా చర్చనీయాంశమైంది. అసెంబ్లీలో ప్రసంగం విషయంలో తమిళనాడు సర్కారు, గవర్నర్‌కు మధ్య తీవ్ర వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సివిల్ సర్వీస్ పరీక్ష రాసి ఇంటర్వ్యూకు హాజరవుతున్న అభర్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘విషయం ఏదైనా కేంద్ర, రాష్ర్టాల మధ్య విభేదాలు ఏర్పడితే ఎలాంటి సందేహం లేకుండా మీరు (ఐఏఎస్‌లు) మాత్రం కేంద్రం పక్షానే ఉండాలి’ అని ఆయన వారికి సలహా ఇచ్చారు. ఇటీవల గవర్నర్ పంపిన పొంగల్ ఆహ్వాన పత్రికలో రాష్ట్ర చిహ్నాన్ని విస్మరించడం, తమిళనాడుకు బదులుగా తమిళగం అని పేర్కొనడం వివాదం రేపిన విషయం తెలిసిందే.
గవర్నర్‌లా.. బీజేపీ కార్యకర్తలా?: ఖర్గే
కేంద్రంలోని బీజేపీ సర్కారు గవర్నర్లను పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. కొందరు గవర్నర్లు రాజ్యాంగ పరిధిని మీరుతూ సమాఖ్య వ్యవస్థకు కళంకం తీసుకొస్తున్నారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో గవర్నర్లను పార్టీ కార్యకర్తల్లా వినియోగించుకుంటూ రాజ్భవన్ల స్థాయిని కేంద్రం దిగజార్చుతున్నదని ఆరోపించారు.
మరో వివాదంలో ఆర్ఎన్ రవి
ఇప్పటికే అసెంబ్లీలో సొంత కవిత్వాన్ని చదవడానికి ప్రయత్నించి విమర్శలపాలైన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన వెంట అసెంబ్లీకి వచ్చిన ఓ అతిథి సభా కార్యకలాపాలను వీడియో తీసినట్టు డీఎంకే ఎమ్మెల్యే టీఆర్బీ రాజా ఆరోపించారు. ‘ఈ నెల 9న అసెంబ్లీలో ప్రసంగించడానికి గవర్నర్ రవి వచ్చారు. ఆయన వెంట ఓ అతిథి కూడా ఉన్నారు. అ అతిథి సందర్శకుల గ్యాలరీలో కూర్చొని సభా కార్యకలాపాలను వీడియో తీశారు. ఇలా చేయడం సభా నిబంధనలకు విరుద్ధం. అసలు అసెంబ్లీలోనికి సెల్ఫోన్లను తీసుకురావడం నిషేధం. అయితే అ అతిథి సెల్‌ఫోను ఎలా తీసుకొచ్చారు. తీసుకొచ్చి వీడియో ఎలా తీశారు. దీనిపై నిజానిజాలు తేల్చడానికి ప్రివిలేజ్ కమిటీకి అప్పగించండి’ అని ఎమ్మెల్యే కోరారు. దీంతో స్పందించిన స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి అప్పగించారు. పరిశీలించి నిజనిజాలు తేల్చాలని సూచించారు.