Sanjay Dutt | బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. దేశంలో గతంలో ఉన్నట్లుగా ప్రస్తుతం శాంతి కనిపించడం లేదంటూ ఆయన ఓ టాక్ షోలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. తాజాగా సంజయ్ దత్ స్పందించి వివరణ ఇచ్చారు. తాను ఆ కార్యక్రమంలో మాట్లాడిన మాటలన్నీ ముందుగా సిద్ధం చేసిన స్క్రిప్ట్‌లో భాగమేనని స్పష్టం చేశారు.గాంధీ జయంతి సందర్భంగా జరిగిన ఓ టాక్ షోలో సంజయ్ దత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో ప్రస్తుత పరిస్థితుల గురించి ఆయనను ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ.. భారతీయులు మంచి మనసున్న వారని, అతిథి మర్యాదల్లో ముందుంటారని చెప్పారు. అయితే ప్రస్తుతం దేశంలో తనకు గతంలో ఉన్నట్లుగా శాంతి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.
దేశంలో శాంతి, ప్రేమ, ఐక్యత ఉండాలని కోరుకుంటున్నానని.. గతంలో ఉన్న పరిస్థితులు మళ్లీ రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సంజయ్ దత్ వ్యాఖ్యలపై నెటిజన్ల మధ్య చర్చ మొదలైంది. అదే కార్యక్రమంలో సంజయ్ దత్‌ను ఐదు నిమిషాల పాటు దేశ ప్రధానమంత్రిగా ఉండే అవకాశం వస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. దీనికి ఆయన తన ‘మున్నాభాయ్’ శైలిలో సరదాగా, వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. మహాత్మా గాంధీని తాను ఎంతగానో విశ్వసిస్తానని చెప్పిన సంజయ్ దత్.. గాంధీజీకి సంబంధించిన ‘చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు’ అనే మూడు కోతుల సిద్ధాంతాన్ని ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నాలుగో కోతి కూడా అవసరమని, ఎవరైనా చెడును చూస్తే దాన్ని సరిదిద్దే వ్యక్తి ఉండాలని వ్యాఖ్యానించారు.
తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో సంజయ్ దత్ తాజాగా ఎక్స్ వేదికగా స్పందించారు. తన మాటలతో ఏ వ్యక్తినీ, ఏ వర్గాన్నీ, ఏ సంస్థనూ బాధపెట్టడం లేదా అవమానించడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.ఆ టాక్ షోలో తాను చేసిన వ్యాఖ్యలు మొత్తం ముందుగా సిద్ధం చేసిన స్క్రిప్ట్‌లో భాగమేనని తెలిపారు. సరదాగా, హాస్యభరితమైన సంభాషణ కోసం తన మాటలను రూపొందించారని చెప్పారు. ముఖ్యంగా ‘మున్నాభాయ్’ సినిమాలో తాను మాట్లాడే విధానం, వ్యంగ్య శైలిని దృష్టిలో పెట్టుకుని ఆ సంభాషణను సిద్ధం చేసినట్లు వివరించారు.ఆ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం మహాత్మా గాంధీ చెప్పిన ప్రేమ, ఐక్యత, ఆప్యాయత సందేశాన్ని ప్రజలకు అందించడమేనని సంజయ్ దత్ తెలిపారు. అయితే తన వ్యాఖ్యలను ఆ సందర్భం నుంచి విడదీసి చూడటంతో వాటి అసలు ఉద్దేశం వేరుగా అర్థమైందని పేర్కొన్నారు.ఎవరినీ కించపరచడం, అగౌరవపరచడం తన ఉద్దేశం కాదని మరోసారి స్పష్టం చేశారు. దీంతో తన వ్యాఖ్యలపై కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు.