న్యూఢిల్లీ: దేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC)కి వచ్చే ఫిర్యాదుల సంఖ్య ఏటికేడు క్రమంగా తగ్గుతున్నదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ లోక్సభలో ఒక ప్రకటన చేసింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ప్రతిమా మండల్ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానం ఇచ్చారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్కు ప్రస్తుత ఏడాదితోపాటు గత మూడేండ్లుగా వస్తున్న ఫిర్యాదుల వివరాలను వెల్లడించాలని, ఈ మధ్య మానవ హక్కుల కమిషన్కు వస్తున్న ఫిర్యాదుల సంఖ్య పెరుగుతున్నదన్న విషయంలో సమాధానం చెప్పాలని, మానవ హక్కులను పరిరక్షించే యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదని ప్రతిమా మండల్ లోక్సభలో ప్రశ్నించారు.
అందుకు మంత్రి సమాధానమిస్తూ.. జాతీయ మానవ హక్కుల కమిషన్కు వచ్చే ఫిర్యాదుల సంఖ్య పెరుగుతున్నదనడంలో వాస్తవం లేదని చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలవల్ల పరిస్థితి ఏటికేడు మెరుగుపడుతున్నదని చెప్పారు. 2018-19లో NHRC కి 89,584 ఫిర్యాదులు రాగా, 2019-20లో ఆ సంఖ్య 76,628కి తగ్గిందన్నారు. 2020-21లో మరింత తగ్గి 74,968కి చేరిందన్నారు. 2021-22లో నవంబర్ 15 వరకు 67,255 ఫిర్యాదులు మాత్రమే వచ్చాయని తెలిపారు.