సిటీ బ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో మురుగు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. శివారు ప్రాంతాల్లో మురుగు ఉత్పత్తికి తగ్గట్లు మురుగు నీటి శుద్ధి కేంద్రాలు లేవు. ఉన్న కొన్నింటిలో శుద్ధి చేసే కెపాసిటీ తగినంత లేదు. దీంతో ప్రతి రోజు ఉత్పత్తి అవుతున్న వందలాది ఎమ్ఎల్డీల వ్యర్థ జలాలు బహిరంగ ప్రదేశాల్లోకి చేరుతున్నాయి. దీంతో భూ కాలుష్యంతో పాటు వాయు కాలుష్యం ఏర్పడి పరసర ప్రాంతాల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. కెపాసిటీ తక్కువగా ఉండటం వల్ల సెప్టిక్ ట్యాంకర్లను ఆయా ఎస్టీపీలకు అనుమతించడం లేదు. దీంతో వారు బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తున్నారు. వ్యర్థాలను రీసైక్లింగ్‌కు ఇద్దామని వెళ్తున్న ట్యాంకర్ యజమానులకు తగినంత కెపాసిటీ లేదని అనుమతించడం లేదని చెబుతున్నారు.
శివారు ప్రాంతాల్లో వీలైనన్ని ఎక్కువ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అదే విధంగా కొన్ని పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు కూడా ఎస్టీపీలు ఏర్పాటు చేసుకోకుండా బహిరంగ ప్రదేశాలకు వ్యర్థ జలాలను వదులుతున్నాయి. దీంతో ఆయా హోటళ్ల పరిసరాలు వ్యర్థ జలాలతో కలుషితమవుతున్నాయి. మరి కొన్ని హైరైజ్ అపార్ట్మెంట్లు కూడా వరద నీరు పేరుతో వ్యర్థ జలాలను దగ్గరలోని డ్రైనేజీ పైపుల్లోకి వదులుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాలు పూర్తిగా వ్యర్థ జలాలతో నిండి పరిసరాల్లో నివసించే ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఇదంతా జరుగుతున్నా జలమండలి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
కెపాసిటీ తక్కువ.. ఉత్పత్తి ఎక్కువ
శివారులోని ఖాజాగూడ, నానక్‌రామ్‌గూడ, కోకాపేటలో మూడు జలమండలి ఎస్టీపీలు ఉన్నాయి. వీటిలో కోకాపేటలోని ఎస్టీపీలో కేవలం మురుగు నీటిని శుద్ధి చేసి కోకాపేట చెరువులోకి నీటిని వదులుతున్నారు. ట్యాంకర్ల ద్వారా వచ్చిన హోటల్, రెస్టారెంట్లు, హైరైజ్ బిల్డింగ్‌ల నుంచి వస్తున్న వ్యర్థ జలాలను అనుమతించడం లేదు. ట్యాంకర్ల ద్వారా వచ్చిన వ్యర్థాల్లో నూనెలతో పాటు ఇతర పదార్థాలు మిళితమై ఉంటాయని దాని వల్ల ట్రీట్మెంట్ మిషనరీలు మరమ్మతులకు గురవుతాయని అనుమతించడం లేదని అధికారులు చెబుతున్నారు. నానక్‌రామ్‌గూడలోని 4.5 ఎంఎల్డీ ఎస్టీపీ రోజుకు పది ట్యాంకర్ల వ్యర్థాలను మాత్రమే శుద్ధి చేయగలుగుతుంది. దీంతో ప్రతి రోజు పది ట్యాంకర్లనే అనుమతిస్తున్నారు.
ఖాజాగూడలోని ఎస్టీపీ 8 ఎంఎల్డీల కెపాసిటీని కలిగి ఉంది. ఇక్కడికి రోజుకు 20 కంటే ఎక్కువ ట్యాంకర్లను అనుమతించడం లేదు. తరచూ మరమ్మతులకు గురవుతుండటంతో ఆ 20 ట్యాంకర్లను కూడా ప్రతిరోజూ అనుమతించడం లేదని ట్యాంకర్ల యజమానులు వాపోతున్నారు. ఈ ప్రాంతాల్లో కొత్త ఎస్టీపీలను ఏర్పాటు చేసేదాకా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జలమండలి అధికారులు మాత్రం కొత్త ఎస్టీపీలు వచ్చేదాకా ఇంతే సంగతులని చెబుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికైనా నూతన ఎస్టీపీలను తొందరగా నిర్మించి పరిసరాలు కలుషితం కాకుండా ఆపి ప్రజలు వ్యాధిన బారిన పడకుండా నిరోధించాలని కోరుతున్నారు.