J&K elections : జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ (NC), కాంగ్రెస్ (Congress) పార్టీలతో కూడిన కూటమి ఘన విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు పెరిగిందన్నారు.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కోసం తాము కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తామన్నారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదానే తమ ప్రధాన డిమాండ్ అని చెప్పారు. ఈ ఎన్నికల్లో పీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. పీడీపీ ఇండియా కూటమిలో భాగంగానే ఉందని, కానీ ఎన్నికల్లో పొత్తు కుదరలేదని తెలిపారు.
దాంతో నేషనల్ కాన్ఫరెన్స్, తాము జట్టుగా పోటీచేశామని, ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో వేచిచూద్దామని జైరామ్ రమేశ్ అన్నారు. అవసరమైతే పీడీపీతో కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.