హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ), న్యూఢిల్లీ: జాతీయ ఉత్తమ విద్యాసంస్థల్లో ఐఐటీ మద్రాస్ టాప్‌లో నిలిచింది. 2023 సంవత్సరానికి గానూ ఉత్తమ జాతీయ విద్యాసంస్థల ర్యాంకులను కేంద్ర విద్యా వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ సోమవారం విడుదల చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) పేరుతో విడుదల చేసిన ఈ ర్యాంకుల్లో 8,686 విద్యాసంస్థలు పాలు పంచుకున్నాయి. ఓవరాల్ క్యాటగిరీలో మొదటి ఐదు స్థానాల్లో ఐఐటీ మద్రాస్, ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ కాన్పూర్ నిలిచాయి. ఐదు ఉత్తమ యూనివర్సిటీల్లో ఐఐఎస్సీ బెంగళూరు, జేఎన్‌యూ, జామియా మిల్లియా ఇస్లామియా, జాదవ్‌పూర్ యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ నిలిచాయి. ఓవరాల్ క్యాటగిరితో పాటు కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లు, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, లా, మెడికల్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, డెంటల్, అగ్రికల్చర్ విభాగాల్లో ర్యాంకులను వేర్వేరుగా విడుదల చేశారు. అందులో ఉత్తమ ఫార్మసీ ఇన్స్టిట్యూట్లలో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ ఆండ్ రిసెర్చ్ మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తమ ఇన్నోవేషన్ ఇన్స్టిట్యూట్లలో ఐఐటీ హైదరాబాద్ మూడో స్థానాన్ని, ఉత్తమ లా కాలేజీల్లో హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి.
తెలంగాణ విద్యాసంస్థల ర్యాంకులు(ఓవరాల్ విభాగం)
విద్యాసంస్థ ర్యాంకు
ఐఐటీ-హైదరాబాద్ 14
హెచ్‌సీయూ 20
ఎన్ఐటీ-వరంగల్ 53
ఉస్మానియా యూనివర్సిటీ 64
(ఇంజినీరింగ్ విభాగం)
ఐఐటీ-హైదరాబాద్ 8
ఎన్ఐటీ-వరంగల్ 21
ఐఐఐటీ- హైదరాబాద్ 55
హెచ్‌సీయూ 71
జేఎన్టీయూ 83
ఎస్ఆర్ యూనివర్సిటీ 98