న్యూఢిల్లీ: భారత బిలియనీర్, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన క్రిమినల్ కేసును ఉపసంహరించుకోవాలన్న నిర్ణయంపై ఇద్దరు డెమొక్రటిక్ సెనెటర్లు అమెరికా న్యాయశాఖను ప్రశ్నించారు. కేసు పరిష్కార చర్చల్లో భాగంగా అదానీ గ్రూప్ అమెరికాలో 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉందని ప్రతిపాదించినట్లు కోర్టు దాఖలు చేసిన పత్రాలు నిర్ధారించడంతో.. ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు.
సెప్టెంబర్ 23న అమెరికా అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్కు రాసిన లేఖలో నెనెటర్లు ఎలిజబెత్ వారెన్, రిచర్డ్ బ్లూమెంటల్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అదానీ పెట్టుబడి ప్రతిపాదన చేసిన విషయం కోర్టు పత్రాల ద్వారా నిర్ధారణ అయిందని తెలిపారు. అదానీ తరపు న్యాయవాది రాబర్ట్ జియుఫ్రా జూనియర్ చేసిన ప్రకటనను కూడా వారు ప్రస్తావించారు. అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి నికోలస్ గరాఫిస్ ఆగస్టు 10న గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ సీఈవో వినీత్ జైన్లపై ఉన్న సెక్యూరిటీస్, వైర్ ఫ్రాడ్ ఆరోపణలను కొట్టివేశారు.
అయితే కేసును ఉపసంహరించుకునేందుకు న్యాయశాఖ అనుసరించిన విధానాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. అదానీ న్యాయవాదులు పెట్టుబడి ప్రతిపాదనను న్యాయశాఖ ముందు ఉంచిన విషయం కోర్టు పత్రాల ద్వారా నిర్ధారణ అయినప్పటికీ, అ ఆఫర్ చేసిన తర్వాత ఏం జరిగిందనన్నది మాత్రం స్పష్టంగా లేదని సెనేటర్లు తెలిపారు.