న్యూఢిల్లీ : భారత ఐటీ సెక్టార్లో సిబ్బంది క్రమబద్దీకరణ వల్ల మరిన్ని ఉద్యోగాల కోతలు ఉండొచ్చని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(నాస్కామ్) సంకేతమిచ్చింది. ఏఐ, ఆటోమేషన్ ఆధారిత ఆపరేషన్ల వైపు కంపెనీలు మళ్లడమే ఇందుకు కారణమని చెప్పింది. టీసీఎస్ తన సిబ్బందిలో 12 వేల మందిని తొలగించనున్నట్టు ఇటీవల ప్రకటించిన తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. స్వల్ప కాలిక కోతలు(మార్పులు) కొనసాగుతున్నప్పటికీ ఇది దీర్ఘకాలిక అవకాశాలను సృష్టించవచ్చని నాస్కామ్ ఆశాజనకంగా ఉంది.
కేంద్ర కార్మిక శాఖ గత శుక్రవారం టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టీసీఎస్)కు సమన్లు జారీ చేసింది. 2 శాతం మంది ఉద్యోగుల తొలగింపు ప్రకటన, 600 ఖాళీల భర్తీలో ఆలస్యంపై నసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్(నైట్స్) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకుంది. ఈ రెండు అంశాలపై సమగ్ర నివేదికను ఇవ్వాలని టీసీఎస్‌ను ఆదేశించింది. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఉద్యోగాల కోత గురించి టీసీఎస్ తన ఉద్యోగులకు ఈ-మెయిల్ పంపిందని నైట్స్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు. ఇది చట్ట విరుద్ధం, అనైతికం, అమానుషమని విమర్శించారు. అయితే ఉద్యోగాల కోతలపై దయతో వ్యవహరిస్తామని టీసీఎస్ సీఈవో కృతివాసన్ తెలిపారు. కొందరిని ఇతర విభాగాల్లో నియమించేందుకు ప్రయత్నిస్తామన్నారు. కంపెనీ మార్గదర్శకాల ప్రకారం ప్రభావిత ఉద్యోగులు పలు ప్రయోజనాలు పొందుతారన్నారు.