నేషనల్ డెస్క్: చంద్రుడిపై నివాసమే లక్ష్యంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చేపట్టిన అత్యంత శక్తిమంతమైన ప్రయోగం ఆర్టెమిస్ -1కి అడ్డంకులు తప్పడంలేదు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6 గంటలకు ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరుగాల్సి ఉన్నది. వాతావరణం అనుకూలించకపోవడం, ఇంధనం లీకేజీ, ఇంజిన్‌లో సమస్యతో కౌంట్‌డౌన్‌ను టీ-40 నిమిషాల వద్ద నిలిపేసినట్టు నాసా ప్రకటించింది. వచ్చే శుక్రవారం వరకూ ప్రయోగం నిర్వహించకపోవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదాపడ్డ ఈ మిషన్.. ఇప్పటివరకూ నాసా చేపట్టిన ప్రయోగాల్లోనే అత్యంత క్లిష్టమైనదిగా, శక్తిమంతమైనదిగా నిపుణులు పేర్కొంటున్నారు. –
ఏమిటీ ఆర్టెమిస్ -1?
చంద్రుడిపై ప్రయోగాలు, మనుషులను అక్కడ సుదీర్ఘ కాలం ఉంచడమే లక్ష్యంగా నాసా ఆర్టెమిస్ సిరీస్ (1,2,3) యాత్రలను చేపట్టనున్నది. దీన్ని అపోలో ప్రాజెక్టుకు అధునాత వెర్షన్‌గా చెబుతున్నారు. ఆర్టెమిస్ సిరీస్‌లో రెండు దశలు ఉన్నాయి. ఒకటి.. చంద్రుడిపై పరిశోధనలు కాగా, రెండోది మనుషులను జాబిలి మీదకు పంపి కాలనీలు నిర్మించడం. ఫ్లోరిడా నుంచి దూసుకుపోయే స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్ఎల్ఎస్) రాకెట్.. తొలి దశకు (ఆర్టిమిస్-1) ఉద్దేశించింది. ఆరు వారాల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. ఒరాయన్ అనే క్యాప్సుల్ ఈ యాత్రలో కీలకపాత్ర పోషించనున్నది.
ప్రయోగంలో ఏమేం పరీక్షిస్తారు?
ఆర్టెమిస్ -1 యాత్రలో వ్యోమగాములను జాబిలి మీదకు పంపరు. కేవలం ఒరాయన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను (లేదా క్యాప్సుల్) మాత్రమే పంపిస్తారు. చంద్రుడి ఉపరితలం నుంచి నీరు, ఇతర వనరులను సేకరించడం, రెండోదశలో పంపించే వ్యోమగాములపై రోదసిలోని రేడియేషన్ స్థాయిలు ఏ మేరకు ప్రభావం చూపొచ్చు తదితర విషయాలను ఈ ప్రయోగంలో విశ్లేషిస్తారు. ఇందుకోసం క్యాప్సుల్‌లోని కమాండర్ సీటులో మనిషిని పోలిన ఒక బొమ్మ, మరో రెండు బొమ్మలను ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. మనిషి కణజాలాన్ని సిమ్యులేట్ చేసే పదార్థంతో వీటిని రూపొందించారు. 42 రోజుల యాత్రలో సుమారు 21 లక్షల కిలోమీటర్ల మేర చంద్రుడి చుట్టూ తిరిగి కీలక సమాచారాన్ని సేకరించి అక్టోబర్ 10న ఒరాయన్ భూమి మీదకు తిరిగి వస్తుంది. ఒరాయన్ సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి తదుపరి ప్రయోగంలో మనుషులను చంద్రుడి మీదకు పంపిస్తారు. 2024లో ఆర్టెమిస్-2 (జామిలి మీదకు వ్యోమగాములు), 2025లో ఆర్టెమిస్-3 (సాధారణ పౌరులు) ప్రయోగాలు జరుగనున్నాయి.
ఈ ప్రయోగం ఎందుకు ప్రత్యేకం?
సుమారు 50 ఏండ్ల కిందటే చంద్రుడి మీదకు మానవుడు అడుగుపెట్టాడు. ఇప్పుడు మళ్లీ అలాంటి ప్రయోగం చేయడంలో ప్రత్యేకత ఏమున్నది అనుకోవచ్చు. అయితే, గతంలో చేసిన ప్రయోగాల్లో వ్యోమగాములు జాబిలిపై గరిష్ఠంగా మూడు రోజులకు మించి లేరు. అయితే ఆర్టెమిస్ సిరీస్ మిషన్‌లో పంపించాలనుకుంటున్న వ్యోమగాములు సుదీర్ఘకాలం చంద్రుడిపై ఉండనున్నారు. అందుకే మానవ చరిత్రలో ఇదో గొప్ప ప్రయోగంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఒరాయన్ క్యాప్సుల్‌ను చంద్రుడి కక్ష్యలోకి తీసుకుపోయే ఎస్ఎల్ఎస్ రాకెట్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్‌గా నాసా చెబుతున్నది. అపోలో వ్యోమనౌకను మోసుకెళ్లిన శాటర్న్-5 రాకెట్ కంటే 15 శాతం ఎక్కువ శక్తిని ఇది కలిగి ఉన్నది.