Sunita Williams | భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బారీ విల్మోర్ ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారిని సురక్షితంగా భూమిపై తీసుకువచ్చేందుకు నాసా మిషన్ చేపట్టనున్నది. జూన్‌లో బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ స్పేస్‌షిప్‌లో ఐఎస్ఎస్కు వెళ్లారు. సాంకేతిక సమస్యల కారణంగా ఇద్దరూ అక్కడే ఉండాల్సిపోవాల్సి వచ్చింది. స్పేస్ఎక్స్ క్రూ-9 మిషన్ మరికొద్ది గంటల్లో ప్రయోగం చేపట్టనున్నది. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్స్టేషన్ నుంచి మధ్యాహ్నం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.17 (భారత్ సమయం 10.47) గంటలకు నింగిలోకి దూసుకెళ్లనున్నది. క్రూ మిషన్ కమాండర్‌గా నాసా నిక్ హేగ్, రష్యా రాస్కోస్మోస్ మిషన్ స్పెషలిస్ట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఉన్నారు. అన్నీ అనుకున్న విధంగా సాగితే 29న సాయంత్రం 5.30 గంటలకు (సోమవారం ఉదయం 3గంటలకు) క్రూ మిషన్‌ని ఐఎస్ఎస్తో డాక్ చేయనున్నారు. సాధారణంగా స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్స్ నలుగురు వ్యోమగాములను ఐఎస్ఎస్కి తీసుకెళ్తుంటాయి. వచ్చే సమయంలో సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌ని తిరిగి తీసుకువచ్చేందుకు రెండు సీట్స్‌ని ఖాళీగా ఉంచారు.