Parkar Solar Probe | హైదరాబాద్, డిసెంబర్ 24 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): మానవ రోదసి ప్రయోగాల్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. భగభగ మండే సూర్యుడికి అత్యంత దగ్గరగా వెళ్లిన మొట్టమొదటి వ్యోమనౌకగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ రికార్డు సృష్టించింది. ఈ మేరకు నాసా వెల్లడించింది.
2018లో పార్కర్ సోలార్ ప్రోబ్ మిషన్‌ను నాసా చేపట్టింది. ఇప్పటికే ఆ స్పేస్‌క్రాఫ్ట్ 21 సార్లు సూర్యుడిని చుట్టేసింది. అంటే, మొత్తంగా 14.9 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. గంటకు 6 లక్షల 92 వేల కిలోమీటర్ల వేగంతో పార్కర్ ప్రోబ్ ప్రయాణిస్తుంది. అంటే గన్ నుంచి వచ్చే బుల్లెట్ వేగం కంటే 200 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది.
మంగళవారం సాయంత్రం సూర్యుడి బాహ్యవలయమైన కరోనాకు సుమారు 61 లక్షల కిలోమీటర్ల దూరం వరకూ పార్కర్ ప్రోబ్ చేరుకొన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. బుధ గ్రహానికి, సూర్యుడికి మధ్య ఉన్న ఎడానికి ఇది 8 రెట్లు తక్కువ దూరమని పేర్కొన్నారు.
సూర్యుడి కరోనా ప్రాంతంలో అతిభయంకరమైన వాతావరణం, రేడియేషన్ ఉంటుంది. ఉష్ణోగ్రత చాలా ఎక్కువ. దీన్ని తట్టుకుని పార్కర్ వ్యోమనౌక డాటాను సేకరించాల్సి ఉంటుంది. అందుకే సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణానికి దెబ్బతినకుండా పార్కర్ ప్రోబ్‌ను బలమైన హీట్షీల్డ్తో కవర్ చేశారు. టైటానియమ్-జిర్కోనియమ్-మాలిబ్డినమ్తో తయారు చేసిన ఈ ప్లేట్ 2,349 డిగ్రీల సెంటిగ్రేడ్ (4,260 డిగ్రీల ఫారన్‌హీట్) ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోగలదు.
సూర్యుడి కరోనాను సమీపించిన పార్కర్‌కు అంత వేడిలో సిగ్నల్స్‌ను భూకేంద్రానికి పంపించడం కుదరకపోవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ, సూర్యుడి వేడిని తట్టుకొని ప్రోబ్ నిలబడితే శుక్రవారంనాటికి సిగ్నల్స్ వచ్చే అవకాశమున్నది.
గత కొన్ని శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు సూర్యుడి గురించి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. సూర్యుడి కేంద్రంలో అత్యంత బ్రహ్మాండమైన ఉష్ణోగ్రతలకు కారణమేమిటన్న విషయం ఇప్పటివరకూ కచ్చితంగా తెలియరాలేదు. అలాగే, సూర్యుడి బాహ్య వలయమైన కరోనా (ఉపరితలం) అంత వేడిగా ఉండటానికి గల కారణాలు, సూర్య తుఫానులను కూడా విశ్లేషించాల్సి ఉంది. అయితే, ఈ విషయాలు భూవాతావరణం, రోదసిలో నుంచి కంటే కరోనా లేయర్‌కు సమీపంలో ఉండి విశ్లేషిస్తే మరింత కచ్చితమైన ఫలితాలు వస్తాయన్న ఉద్దేశంతో ఈ మిషన్‌ను ప్రయోగించారు.