బెంగళూరు : ఓ బస్సు యూటర్న్ తీసుకునేందుకు యత్నిస్తోంది.. దాని వెనుకాలే ఓ బైకర్ వేగంగా దూసుకొచ్చాడు. ద్విచక్ర వాహనదారుడు తన బైక్ను ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. బస్సు డ్రైవర్ ఆకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో, వెంట్రుకవాసిలో బైకర్ చావు నుంచి తప్పించుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కర్ణాటకకు చెందిన ఓ ప్రయివేటు బస్సు మంగళవారం సాయంత్రం మంగళూరు నుంచి ఏలియార్ పడావ్కు బయల్దేరింది. అయితే మార్గమధ్యలో బస్సు యూటర్న్ తీసుకునేందుకు యత్నించింది. బస్సు వెనుకాలే వచ్చిన ద్విచక్ర వాహనదారుడు ఈ విషయాన్ని గమనించలేదు. అదే వేగంతో బస్సు ముందు నుంచి తన బైక్ను పోనిచ్చాడు. బస్సు డ్రైవర్ అప్రమత్తమై ఆకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో.. బైకర్ చావు నుంచి తప్పించుకున్నాడు. ఓ చెట్టు, షాపు మధ్యలో నుంచి స్కూటీ దూసుకెళ్లినప్పటికీ యువకుడికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన అంతా 15 సెకండ్లలో జరిగిపోయింది.