న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ప్రసంగించనున్నారు. చర్చలో పాల్గొనే వక్తల జాబితాను తాజాగా యూఎన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఐక్యరాజ్యసమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అయితే హై లెవల్ డిబేట్ మాత్రం సెప్టెంబర్ 23 నుంచి 29 వరకు జరగనున్నది. ఆ సమయంలో తొలుత బ్రెజిల్ చర్చను ప్రారంభిస్తుంది. ఆ తర్వాత అమెరికా మాట్లాడుతుంది. సెప్టెంబర్ 23వ తేదీన యూఎన్జీఏ పోడియం నుంచి డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. హై లెవల్ డిబేట్లో పాల్గొనే స్పీకర్ల జాబితాలో భారత ప్రభుత్వాధినేత మాట్లాడనున్నట్లు పేర్కొన్నది. సెప్టెంబర్ 26వ తేదీన ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుందని ఆ జాబితాలో ఉంది. అదే రోజున ఇజ్రాయిల్, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నేతలు కూడా ప్రసంగిస్తారు. యూఎన్ స్పీకర్స్ లిస్టులో ప్రధాని మోదీ పేరు ఉన్న నేపథ్యంలో.. వచ్చే నెలలో ఆయన అమెరికా వెళ్లే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.