న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇవాళ ఆ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే శీతాకాల సమావేశాల్లోనే బిల్లులను వాపస్ తీసుకోనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ పరిణామాలపై తాజాగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ( Lalu Prasad Yadav ) స్పందించారు.
వ్యవసాయ చట్టాల విషయంలో విజయం సాధించిన రైతులకు లాలూ అభినందనలు తెలియజేశారు. రైతులు ఘన విజయం సాధించారని, రైతుల దెబ్బకు ప్రధాని నరేంద్రమోదీతోపాటు బీజేపీ ప్రభుత్వ అహంకారం ఓడిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. కనీస మద్దతు ధరపై చట్టం చేసేవరకు రైతుల పోరాటం కొనసాగుతుందన్నారు. కేంద్రం వెంటనే కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని లాలూ యాదవ్ డిమాండ్ చేశారు.