Namo Bharat Trains : ఇక నుంచి నమో భారత్ రైళ్లు (Namo Bharat Trains) ప్రైవేట్ వేడుకలకు వేదికలుగా మారనున్నాయి. పుట్టినరోజులు (Birthdays), పెళ్లిరోజులు (Marriage days), పెళ్లిళ్లకు ముందు చేసే ఫొటోషూట్లు, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలకు రైలు బోగీలను అద్దెకు ఇచ్చేలా ‘నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (NCRTC)’ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తులు, ఈవెంట్ ఆర్గనైజర్లు, ఫొటోగ్రఫీ సంస్థలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.
స్టేషన్లలో నిలిపి ఉంచిన బోగీలనుగానీ, లేదంటే కదులుతున్న నమో భారత్ రైలు బోగీలనుగానీ వినియోగదారులు అద్దెకు తీసుకోవచ్చు. వేడుకల కోసం దుహాయ్ డిపో వద్ద ఒక నమూనా బోగీని అలంకరించి ఎప్పుడూ అందుబాటులో ఉంచుతారు. బోగీలకు బుకింగ్ చార్జీలను గంటకు రూ.5,000గా నిర్ణయించారు. వేడుకకు అవసరమైన డెకరేషన్ సామాగ్రి సెట్ చేసుకునేందుకు మరో 30 నిమిషాల సమయం అదనంగా ఇస్తారు.
అయితే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య మాత్రమే వేడుకలకు అనుమతి ఉంటుంది. వేడుకలు జరుపుకునే వారు సాధారణ రైలు కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలిగించకుండా, ప్రయాణికులకు అసౌకర్యం లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ వేడుకలు NCRTC ఉద్యోగులు, భద్రతా సిబ్బంది పర్యవేక్షణలోనే జరుగుతాయి. ఢిల్లీ-మేరఠ్ కారిడార్‌లోని ఆనంద్ విహార్, ఘజియాబాద్, మేరఠ్ సౌత్ స్టేషన్లలో ఈ సౌకర్యం చాలామందిని ఆకర్షిస్తుందని ఆశిస్తున్నారు.
అంతేగాక సినిమా షూట్లు, డాక్యుమెంటరీలు, ప్రకటనలు ఇంకా ఇతర విజువల్ ప్రాజెక్ట్‌ల కోసం నమో భారత్ రైళ్లు, స్టేషన్లను అద్దెకు తీసుకునేందుకు NCRTC మరో విధానాన్ని కూడా రూపొందించింది.