హైదరాబాద్, జూలై 23: కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన రుద్రమ దేవిని ప్రస్తావిస్తూ తమిళనాడులోని చిదంబరంలో గల నటరాజ ఆలయంలో తాజాగా ఓ శిలాశాసనం వెలుగుచూసింది. రాణి రుద్రమను ప్రస్తావిస్తూ ఓ శిలాశాసనం బయటపడటం ఇదే మొదటిసారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆలయంలోని పశ్చిమ గోపురం(మహాద్వారానికి ఎడమవైపు)పైన ప్రాచీన తమిళ లిపిలో(సెందమిళ్) చెక్కిన ఈ శిలాశాసనంలో ప్రస్తుత కేరళకు చెందిన ట్రావెన్కోర్(వేనాడన్)పై విక్రమ పాండ్య మహారాజు సాధించిన విజయాన్ని కీర్తిస్తూ రాసి ఉంది. తమిళనాడుకు చెందిన ఓ పార్లమెంట్ సభ్యుడు అడిగిన ప్రశ్నకు జూలై 28న సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఇవ్వనున్న జవాబును తయారుచేసేందుకు పురావస్తు శాఖ ఎంపీగ్రాఫీ డైరెక్టర్ కే మునిరత్నం రెడ్డి ఈ శాసనాన్ని చదివారు.
ఈ శాసనంలో రెండు, మూడు పంక్తులు చాలా ఆసక్తికరంగా ఉన్నట్లు మునిరత్నం చెప్పారు. ఆ ప్రాంతంలోని ఇతర సామ్రాజ్యాలను జయించుకుంటూ వస్తున్న విక్రమ పాండ్య చక్రవర్తి ఉత్తరం వైపు ముందుకు సాగలేకపోయారు. అందుకు కారణం కాకతీయ సామ్రాజ్యాన్ని పాలిస్తున్న ఓ మహిళ. ఆమే కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి కుమార్తె రుద్రమదేవి అని ఆ శాసనంలో పొందుపరిచి ఉన్నట్లు మునిరత్నం వెల్లడించారు. ఈ శాసనం చారిత్రకంగా చాలా కీలకమైనదని, ఇరుగుపొరుగు రాజ్యాలలో నాటి ప్రాంతీయ రాజకీయ చరిత్రను ఇది ప్రస్తావిస్తున్నదని ఆయన తెలిపారు. ఇది 13వ శతాబ్దం నాటి శాసనమని, రుద్రమదేవి పేరును ప్రస్తావించడం ఆమె శక్తిని ఇది తెలియచేస్తున్నదని ఆయన చెప్పారు. ఈ శాసనం గురించి శాసన పరిశోధకులు ఎక్కడా ప్రస్తావించ లేదని, కాకతీయ సామ్రాజ్యంపై వచ్చిన చరిత్ర పుస్తకాలలో కూడా దీని ప్రస్తావన లేదని మునిరత్నం తెలిపారు.
శౌర్యానికి ప్రతీక రాణి రుద్రమ
కాగా, కాకతీయ మహారాజు గణపతి దేవుడికి రుద్రాంబ(రుద్రమదేవి), గణపాంబ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారని ప్రముఖ చరిత్రకారుడు ద్యాయంపల్లి సత్యనారాయణ తెలిపారు. జ్యేష్ఠ పుత్రికైన రుద్రమదేవి గణపతి దేవుని వారసురాలిగా గుర్తింపు పొందారని, ఆమెకు అన్ని అంశాలలో గణపతి దేవుడు శిక్షణ ఇచ్చారని ఆయన వివరించారు. రెండవ కుమార్తె గణపాంబ రాజకీయ కారణాలతో కోట కుటుంబానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నారని ఆయన తెలిపారు. కాకతీయ సామ్రాజ్యంలో గొప్ప పరాక్రమవంతురాలైన సామ్రాజ్ఞిగా రుద్రమదేవి గుర్తింపు పొందారని, మూడు దశాబ్దాలపాటు (1259-1289) ఆమె కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించి గొప్ప పాలకులలో ఒకరిగా చరిత్రలో నిలిచిపోయారని చరిత్రకారుడు తెలిపారు. శౌర్య పరాక్రమాలు, పరిపాలనా సంస్కరణలు, కళలు, సంస్కృతి పోషణలో ఆమె గొప్ప పేరు సంపాదించుకున్నారని, పురుష దుస్తులు ధరించి ఆమె దర్బార్ను నిర్వహించడంతోపాటు యుద్ధ రంగంలో సైన్యాన్ని ముందుండి నడిపించి గొప్ప గొప్ప రాజులనే మట్టికరిపించి విజయాలు సాధించారని ఆయన వివరించారు.