హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ)/ కొత్తగూడెం ప్రగతి మైదాన్, మే 26/సుబేదారి: పాకిస్థాన్ కోరితే కాల్పుల విరమణకు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం.. తాము కోరితే పట్టించుకోలేదని మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 21న మాడ్ డివిజన్ గుండెకోట్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ బీఆర్ దాదా అలియాస్ ప్రకాశ్ అలియాస్ నర్సింహారెడ్డి అలియాస్ విజయ్ అలియాస్ కృష్ణ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీపీఐ(మావోయిస్టు) పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో సోమవారం సోషల్ మీడియా వేదికగా లేఖ విడుదలైంది.
మారణకాండలో ఉద్యమ నేత బసవరాజుతోపాటు సీసీ స్టాఫ్ రాష్ట్ర కమిటీ స్థాయి కామ్రేడ్ నాగేశ్వరరావు అలియాస్ మధు అలియాస్ జంగ్ నవీన్, సీసీ సిబ్బంది సంగీత, భూమిక, వివేక్, సీపీవైపీసీ కార్యదర్శి కామ్రేడ్ చందన్ అలియాస్ మహేష్, సీపీవైపీసీ సభ్యులు గుడ్డు, లాల్సు, రమే, సూర్య, మాసే, కమల, నాగేశ్, రాగో, రాజేష్, రవి, సునీల్, సరిత, రేష్మ, రాజు, జమున, గీత, హుంగి, సంకి, భద్రు, నీలేష్, సంజు వీర మరణం పొందారని, వీరందరికీ విప్లవ జోహార్లతో నివాళులర్పిస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. మే 21 భారత విప్లవోద్యమ చర్రితలో చీకటి రోజుగా మిగిలిపోతుందన్నారు.
‘నా గురించి కాదు.. యువ నాయకత్వం గురించి ఆలోచించండి. నా భద్రత కంటే.. విప్లవంలోని యువకుల భద్రత ముఖ్యం. మనం చనిపోయినా కూడా ఉద్యమం కొనసాగాలి. ఎప్పటికీ ఉద్యమం బలహీనంగా మారకూడదు. ఈ త్యాగాల స్ఫూర్తితో విప్లవం పునర్నిర్మించబడుతుందని నేను నమ్ముతున్నాను. మావోయిజం రెట్టింపు శక్తితో ఉద్భవిస్తుంది. ఈ ఫాసిస్టు ప్రభుత్వాన్ని ప్రజలే చిత్తుగా ఓడిస్తారు. ఈ ఉద్యమం మున్ముందు మరింత శక్తిమంతంగా మారాలి. మనవెంట ప్రజలు ఉన్నారు. మీరు సురక్షితంగా ఉండండి.. లాల్‌సలామ్.. విప్లవం వర్ధిల్లాలి’ అంటూ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి, కామ్రేడ్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ భానుదాదా చివరిగా పలికినట్లు మావోయిస్టు దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సోమవారం లేఖను విడుదల చేసింది.
నంబాలను బతికి ఉండగానే పట్టుకొని, చిత్రహింసలు పెట్టిన తర్వాత కాల్చి చంపారని లేఖలో స్పష్టం చేసింది. ఈ లేఖలో మే 21న జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం 28 మావోయిస్టులు చనిపోయినట్లు అధికార ప్రతినిధి వికల్ప్ నిర్ధారించారు. నంబాలను కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించి విఫలమైనట్లు మావోయిస్టులు తెలిపారు. మొత్తం ఆరు రోజుల పాటు సాగిన ఎన్కౌంటర్లో మొత్తం 35 మంది మావోయిస్టులు నంబాల కోసం చనిపోనియినట్లు చెప్పారు. నంబాల బృందంలో గతంలో పనిచేసిన ఆరుగురు ఇటీవల ప్రాణ భయంతో లొంగిపోయారని, ఆ కోవర్టులు ఇచ్చిన సమాచారంతోనే సాంకేతికంగా పోలీసులు తమను వేలాదిగా చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. 35 మందిలో 28 మంది చనిపోగా, ఏడుగురు ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు.
ఆపరేషన్ కగార్‌లో భాగంగా ఆధునిక ఆయుధాలతో సాయుధులైన వేలాది బలగాలు తమపై డ్రోన్లు, హెలికాప్టర్లతో బాంబుల వర్షం కురిపించారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. హెలికాప్టర్లతో వారికి తినడానికి తిండి, తాగడానికి నీరు అందించారని, తమకు అవేమీ లేకపోయినా కూడా వారితో 60 గంటల పాటు పోరాడామని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమకు సహకరించకుండా వారి ఇండ్లను పోలీసులు ధ్వంసం చేశారని, అడ్డొచ్చిన ఆదివాసీలను చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అప్పటికే మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలను కుటుంబసభ్యులు తీసుకెళ్లకుండా బాంబులతో పేల్చారని, తుపాకులతో విచ్చలవిడిగా కాల్చారని చెప్పారు. ఈ దారుణ ఎన్కౌంటర్లో తమ అగ్రనేత నంబాల కేశవరావు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సీనియర్ సభ్యుడు కామ్రేడ్ శివాజీ అలియాస్ డాక్టర్ రాజు సహా మొత్తం 28 మంది (నలుగురు మహిళా పార్టీ కేడర్లు) అమరులైనట్లు తెలిపారు. వారందరికీ శిరసు వంచి నివాళులు అర్పించినట్లు ప్రకటించారు.
నంబాల బృందంలోని కొందరు సభ్యులు లొంగిపోయిన దగ్గర్నుంచీ.. తమ వైపు పోలీసు బలగాలు వస్తాయనే అనుమానాలు ఉన్నట్లు మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. 6 నెలలుగా కేశవరావు జాడను పసిసగడుతున్నారని, ఆయన తమను ముందుండి నడిపించారని లేఖలో తెలిపారు. దాడులు జరుగుతాయని తెలిసినా కూడా కామ్రేడ్ నంబాల చెప్పినట్లు శాంతియుత చర్చల కోసం ఎదురుచూసినట్లు చెప్పారు. అందుకోసం 40 రోజులుగా ఎటువంటి చర్యలకు పాల్పడలేదని చెప్పారు. అయినా ప్రభుత్వ బలగాలు దాడులకు తెగబడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం, దేశ సంపద, ప్రకృతి వనరులను కాపాడటానికి ప్రాణాలు అర్పించిన వీరులను దేశ ప్రజలు నిజమైన వీరులుగా గుర్తించాలని కోరారు.
దేశ సంపదను కాపాడుతున్న వ్యక్తులపై నగరాల్లో కూర్చొని ఇష్టమొచ్చినట్లు మాట్లాడవద్దని హెచ్చరించారు. దేశంలో ఉంటూ, దేశ ద్రోహులుగా నిలుస్తున్నవారిని, దేశాన్ని కార్పొరేట్లకు అమ్ముతున్నవారిని బహిరంగంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్ ప్రభుత్వం కుట్రపూరితంగా చేపట్టిన ఈ దారుణ హత్యాకాండలను దేశ ప్రజలు తీవ్రంగా ఖండించాలని కోరారు. విప్లవ ఉద్యమంలో అమరులైన కామ్రేడ్ల పాత్ర గురించి సెంట్రల్ కమిటీ ఒక పుస్తకాన్ని త్వరలో విడుదల చేస్తుందని తెలిపారు.
మావోయిస్టు పార్టీ వికల్ప్ పేరుతో విడుదలైన లేఖ