నాగ్‌పూర్, మార్చి 18: నాగ్‌పూర్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు ముందస్తు ప్రణాళికతో జరిగినవేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. ఔరంగజేబు సమాధిపై ఏర్పడిన వివాదానికి సంబంధించిన కేసులో ఇప్పటి వరకు 50 మందిని అదుపులోకి తీసుకున్నామని, నాగ్‌పూర్‌లో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతున్నదని ఆయన తెలిపారు. ఛత్రపతీ శంభాజీ మహరాజ్ చరిత్ర ఆధారంగా తీసిన ఛావా చిత్రం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్‌పై ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచిందని, అయితే ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. మరోవైపు, ఔరంగజేబ్ వివాదంపై ప్రభుత్వం మీద విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలోని ముఖ్య సమస్యలైన నిరుద్యోగం, రుణభారం, రైతుల ఆత్మహత్యలు వంటివి ప్రస్తావించకుండా ప్రజలంతా అశాంతి, అస్థిరత గురించే చర్చించుకునే పరిస్థితులు కల్పించారని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది విమర్శించారు.