నాగపూర్: మహారాష్ట్రలోని నాగపూర్(Nagpur Violence)లో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. సోమవారం రాత్రి అక్కడ స్వల్ప స్థాయిలో హింస చోటుచేసుకున్నది. సోమవారం రాత్రి 8 నుంచి 8.30 నిమిషాల మధ్య కొన్ని చోట్ల ఘర్షణాత్మాక వాతావరణం నెలకొన్నది. ఓ ఫోటోకు నిప్పుపెట్టినట్లు వార్తలు వ్యాపించడంతో అక్కడ అల్లర్లు చోటుచేసుకున్నాయి. దీంతో భారీ సంఖ్యలో జనం నిరసన చేపట్టేందుకు వచ్చినట్లు పోలీసు కమీషనర్ డాక్టర్ రవీందర్ సింఘాల్ తెలిపారు.
హింసాత్మక ఘటన జరిగిన సమయంలో రెండు వాహనాలకు నిప్పుపెట్టారు. రాళ్లు రువ్వారు. హింసకు దిగిన వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. కూంబింగ్ ఆపరేషన్ ద్వారా నిందితుల్ని గుర్తిస్తున్నారు. నగరంలో 144 సెక్షన్ అమలు చేశామన్నారు. జనం గుమ్మికూడడంపై ఆంక్షలు విధించారు. అనవసరంగా ఇంటి బయటకు రావొద్దు అని కోరారు. వదంతులను వ్యాపించడం కానీ నమ్మడం కానీ చేయవద్దు అన్నారు. ప్రభావిత ప్రాంతం మినహా.. నగరంలోని మిగితా ప్రాంతాలన్నీ శాంతియుతంగా ఉన్నట్లు పోలీసు కమీషనర్ సింఘాల్ తెలిపారు.
ఔరంగజేబ్ సమాధి అంశంపై మహారాష్ట్రలో వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. సోమవారం రాత్రి నాగపూర్లోని మహల్ ఏరియాలో వీహెచ్పీ సభ్యులు ఔరంగజేబ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. ఆ సమయంలో పలువురు గాయపడ్డారు. వాహనాలకు నిప్పుపెట్టారు. రాళ్లు రువ్వే ఘటనతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో అక్కడ ఆందోళనకర వాతావరణం నెలకొన్నది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నా.. కొంత ఉద్రిక్తంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నిన్న రాత్రి జరిపిన కూంబింగ్ ఆపరేషన్లో 80 మందిని అరెస్టు చేశారు. మహల్ ఏరియాలో భారీగా పోలీసుల్ని మోహరించారు. 55 సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా పెట్టారు. నగరంలో 163 సెక్షన్ అమలు చేస్తున్నారు.