నాగాలాండ్‌లో సాధారణ పౌరులపై ఆర్మీ జవాన్లు జరిపిన కాల్పుల ఘటన ఇంకా రగులుతూనే ఉంది. తాజాగా శనివారం ఈ ఘటనను నిరసిస్తూ నాగాలాండ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అమిత్‌షా దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి పార్లమెంట్లో ఇచ్చిన వివరణ పూర్తిగా తప్పని, కల్పిత విషయమని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు అమిత్‌షా వెంటనే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
”మాకు మీ సానుభూతి అవసరమే లేదు. మాకు న్యాయం కావాలి. జరిగిన సంఘటనకు అమిత్‌షా వక్రభాష్యం చెప్పారు. ఆయన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. క్షమాపణలు చెప్పాలి. మాకు న్యాయం జరగాలి. అప్పటి వరకూ పోరాటం ఆపేది లేదు” అని నిరసనదారులకు నేతృత్వం వహించిన ఓ వ్యక్తి స్పష్టం చేశారు. అలాగే ఏఎఫ్ఎస్పీఏ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కూడా నిరసనకారులు మరోమారు డిమాండ్ చేశారు.
ఏం జరిగిందంటే…
నాగాలాండ్‌లో సైన్యం చేపట్టి తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. మోన్ జిల్లా ఓటింగ్ గ్రామంలో తీవ్రవాదులనుకుని పొరపాటున స్థానికులపై సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మాయన్మార్ సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. భద్రతా బలగాలకు చెందిన ఓ జవాన్ కూడా ఈ ఘటనలో చనిపోయినట్టు అధికారులు తెలిపారు. గ్రామస్థులను గుర్తించడంలో పొరపాటు వల్లే ఇలా జరిగిందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
నాగాలాండ్‌లోని మోన్ జిల్లా ఓటింగ్ గ్రామంలో సైన్యం ఆపరేషన్ చేపట్టింది. ఈ సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది. తీవ్రవాదులనుకొని సైన్యం సామాన్య పౌరులపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 14 మంది పౌరులు మరణించారు. వారు తమ కూలీ పనిని ముగించుకొని, ఇళ్లకు పయనమవుతున్నారు. ఈ సమయంలోనే జవాన్లు వీరిపై కాల్పులు జరిపారు.