కోహిమా: నాగాలాండ్‌కు తొలి మహిళా ఎమ్మెల్యే లభించింది. ఆ రాష్ట్రం ఏర్పడి 60 ఏళ్ల తర్వాత తొలిసారి ఒక మహిళ శాసనసభలో అడుగుపెట్టనున్నది. బీజేపీ మిత్రపక్షమైన నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)కి చెందిన హెకానీ జఖాలు ( Hekani Jakhalu) ఈ ఘనత సాధించింది. దిమాపూర్ 3వ స్థానం నుంచి ఆమె విజయం సాధించింది. లోక్ జనశక్తి పార్టీకి చెందిన అజెటో జిమోమిని ఆమె ఓడించింది. 48 ఏళ్ల హెకానీ జఖాలు న్యాయవాదితోపాటు సామాజిక కార్యకర్త కూడా.
కాగా, 60 అసెంబ్లీ స్థానాలున్న నాగాలాండ్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగాయి. మొత్తం 183 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. గురువారం కౌంటింగ్ నిర్వహించారు. పశ్చిమ అంగామి స్థానంలో పోటీ చేసిన ఎన్డీపీపీకి చెందిన మరో మహిళా అభ్యర్థి సల్హౌటుయోనువో క్రూసే కూడా ముందంజలో ఉన్నారు.
మరోవైపు నాగాలాండ్‌లో అధికారంలో ఉన్న ఎన్డీపీపీ-బీజేపీ కూటమి విజయం దిశగా దూసుకెళ్తున్నది. సగానికిపైగా స్థానాల్లో లీడ్‌లో ఉన్నది. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోనున్నది. ముఖ్యమంత్రి నేపియూ రియో నేతృత్వంలోని నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) 2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి 30 సీట్లు గెలుచుకోగా, ఎన్పీఎఫ్ 26 స్థానాలకు పరిమితమైంది.