బెంగళూరు, సెప్టెంబర్ 10: కోచింగ్ క్లాసులపై ఇన్ఫోసిన్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి విమర్శలు గుప్పించారు. పరీక్షల్లో పిల్లలు మెరుగ్గా రాణించేందుకు కోచింగ్ క్లాసులు సరైనమార్గం కాదని అభిప్రాయపడ్డారు. తరగతి గదిలో టీచర్లు చెప్పే పాఠాలపై శ్రద్ధ చూపని విద్యార్థులకే కోచింగ్ తరగతులు అవసరమవుతాయని పేర్కొన్నారు. పరీక్షల్లో పిల్లలు ఉత్తీర్ణులు కావడానికి కోచింగ్ క్లాసులు తప్పుడు మార్గంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
బట్టీ పట్టడం కాకుండా విమర్శనాత్మక ఆలోచన పిల్లల విద్యకు పునాదిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. బెంగళూరులో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ను.. ఐఐటీ, ఎన్ఐటీల్లో సీటు పొందాలంటే కోచింగ్ సంస్థలు కీలకం కాదా? అని ఒకరు ప్రశ్నించారు.
‘కోచింగ్ క్లాసులకు వెళ్తున్న చాలామంది విద్యార్థులు తరగతి గదిలో టీచర్ మాటల్ని వినటం లేదు. వాస్తవ ప్రపంచం విసిరే సవాళ్లను పరిష్కరించే విశ్లేషణ, పరిశీలనకు మన విద్యలో ప్రాధాన్యం కల్పించాలి’ అని అన్నారు. సమస్య పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచనకు ‘కోచింగ్ క్లాసులు’ ఆటంకంగా మారుతాయని ఆయన అన్నారు.