Priyanka Gandhi : ప్రపంచం అంతా తన సోదరుడికి వ్యతిరేకంగా ఉన్ననాడు వాయనాడ్ ప్రజలు అండగా నిలిచారని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ అన్నారు. మీరు ఇచ్చిన మద్దతుతోనే ఆయన దేశంలో 8 వేల కిలోమీటర్ల యాత్ర చేయగలిగారని ఆమె పొగిడారు. నా సోదరుడికి మద్దతుగా నిలిచిన మీ అందరికీ మా కుటుంబం రుణపడి ఉంటుందని చెప్పారు. ఆయన ఇప్పుడు మిమ్మల్ని విడిచి వెళ్లాల్సి వచ్చిందని, కానీ నేను ఆయనకు, మీకు మధ్య బంధాన్ని బలోపేతం చేస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు.
వాయనాడ్ లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేయడానికి ముందు తన సోదరుడితో కలిసి నియోజకవర్గంలోని కల్పెట్ట పట్టణంలో రోడ్ షో నిర్వహించిన ప్రియాంకాగాంధీ.. ఆ తర్వాత బహిరంగసభలో ప్రసంగించారు. వాయనాడ్ నియోజకవర్గం సమస్యల గురించి తన సోదరుడు చెప్పాడని, ఇప్పుడు నేను ప్రత్యక్షంగా మీ సమస్యలు తెలుసుకుంటానని, ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
తాను 35 ఏళ్లుగా వివిధ రాష్ట్రాల్లో, వివిధ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాని, కానీ ఇప్పుడు తొలిసారిగా నా కోసం నేను ప్రచారం చేసుకుంటున్నానని ప్రియాంకాగాంధీ వ్యాఖ్యానించారు. వాయనాడ్‌లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాగా వాయనాడ్ లోక్‌సభ స్థానానికి నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.