Madhya Pradesh : తనకంటే 21 ఏళ్ల పెద్ద వయస్సున్న భర్తను వద్దని చెప్పిందో యువతి. అంతేకాదు.. తాను ప్రియుడితోనే ఉంటానని స్పష్టం చేసింది. ఇదంతా జరిగింది కోర్టు విచారణలో. ఈ సందర్భంగా కోర్టు ఆ యువతి నిర్ణయానికే ప్రాధాన్యమిచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. 19 ఏళ్ల ఒక యువతికి 40 ఏళ్ల అవ్‌దేష్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వివాహమైన దాదాపు ఏడాది తర్వాత ఆ యువతి అనూజ్ కుమార్ అనే వ్యక్తితో వెళ్లిపోయింది. దీంతో అవ్‌దేష్ తన భార్య ఆచూకీ తెలపాలని కోరుతూ హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు.
దీంతో ఆ యువతిని గుర్తించాలని కోరుతూ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో యువతి కోసం వెతికిన పోలీసులు ఆమెను గుర్తించారు. నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ మహిళా సంరక్షా వసతి గృహం అయిన వన్ స్టాప్ సెంటర్లో ఆమెను ఉంచారు. అనంతరం కోర్టుకు తీసుకెళ్లారు. చివరకు ఈ అంశం మధ్యప్రదేశ్ హైకోర్టుకు చేరింది. ఈ సందర్భంగా ఆ యువతి తన భర్తతో కలిసి ఉండటం ఇష్టం లేదని, ప్రియుడితోనే ఉంటానని చెప్పింది. దీంతో ఆ భార్యాభర్తలిద్దరికీ కొంతకాలం కౌన్సెలింగ్ ఇచ్చారు. పలుమార్లు ఇద్దరితో చర్చలు జరిపారు. కలిపి ఉంచేందుకు ప్రయత్నించారు. కానీ, దీనికి ఆ యువతి అంగీకరించలేదు. తనకు, భర్తకు మధ్య 21 ఏళ్ల వ్యత్యాసం ఉందని తెలిపింది. ఇద్దరి ఆలోచనలు వేరని, పైగా తనను సరిగ్గా చూసుకోవడం లేదని కోర్టుకు తెలిపింది. అంత వయసు వ్యత్యాసం ఉన్నప్పుడు బంధం సమతూకంగా ఉండదని తెలిపింది. తాను తన ప్రియుడు అనూజ్ కుమార్‌తోనే ఉంటానని స్పష్టం చేసింది. తను ఇప్పుడు చిన్న పిల్ల కాదని, తను సొంతంగా జీవించగలనని కోర్టుకు చెప్పింది.
భర్తతోకానీ, చివరకు తల్లిదండ్రులతో కానీ ఉండటం ఇష్టం లేదని వెల్లడించింది. ఆ యువతి వాదనతో మధ్యప్రదేశ్ హైకోర్టులోని గ్వాలియర్ బెంచ్ ఏకీభవించింది. ఎవరినీ, ఎవరితో ఉండాలని బలవంతంగా చెప్పలేమని, తనకు నచ్చిన వ్యక్తితో ఉండే హక్కు ఆ యువతికి ఉందని కోర్టు అభిప్రాయపడింది. దీంతో ఆ యువతి ప్రియుడితోనే ఉండేందుకు జస్టిస్ ఆనంద్ పాఠక్, జస్టిస్ పుష్పేంద్ర యాదవ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం అనుమతించింది. అయితే, ఆరు నెలలపాటు ఆ యువతి క్షేమం వంటి విషయాల్ని ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని కోర్టు తెలిపింది. అంటే వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో ఆ యువతి రక్షణ, ఇతర బాధ్యతల్ని పర్యవేక్షిస్తారు. అనంతరం నిబంధనలకు అనుగుణంగా ఆమెను సెంటర్ నుంచి రిలీజ్ చేస్తారు.