న్యూఢిల్లీ: గుర్తింపు పొందిన వార్తా సంస్థలు కోర్టు విచారణల గురించి స్వేచ్ఛగా వార్తలు ప్రచురించవచ్చు, కానీ.. కోర్టు విచారణలకు సంబంధించి ఆడియో, వీడియో క్లిప్‌లను వార్తా కథనాల్లో ఉపయోగించటంపై ఆంక్షలు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు విచారణలకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారం, వీడియో రికార్డింగ్స్ గురించిన పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది.
కోర్టు వీడియోలపై సుప్రీంకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీచేసింది. అనుమతి లేకుండా సోషల్‌మీడియాలో పోస్ట్ చేయటం, షేర్ చేయటాన్ని నిషేధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. జూలై 24 నాటి మధ్యంతర ఉత్తర్వుల్లోని 11వ పేరా కొంత గందరగోళంగా ఉండటంతో దీనిపై మరింత వివరణ ఇస్తున్నట్టు పేర్కొన్నది. కోర్టు కార్యకలాపాల వార్తలను ప్రసారం చేయటం, ప్రచురించటంపై సంపూర్ణ నిషేధాన్ని విధిస్తున్నట్టు భావించరాదని సదరు పేరాపై స్పష్టతనిచ్చింది.