ముంబై: తన టీనేజ్ కూతురు మొబైల్లో ఆన్లైన్ గేమ్ ఆడుతున్న సమయంలో .. నగ్న ఫోటో పంపాలంటూ ఓ సైబర్ క్రిమినల్ మెసేజ్ చేశాడని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్( Akshay Kumar) తెలిపారు. కానీ తన కూతురు చాలా సమయస్పూర్తితో స్పందించి తన మొబైల్‌ను స్విచాఫ్ చేసిందన్నారు. ముంబైలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన సైబర్ అవగాహన కార్యక్రమంలో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ ఈ ఉదంతాన్ని గుర్తు చేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు సీనియర్ పోలీసు ఆఫీసర్లు కూడా ఆ వేదికపైనే ఉన్నారు.
కొన్ని నెలల క్రితం ఈ ఘటన జరిగిందని, తన కుమార్తె ఆన్లైన్ గేమ్ ఆడుతున్న సమయంలో ఓ అపరిచిత వ్యక్తి ఆమెకు తారసపడ్డాడని, అతను తొలుత స్నేహపూర్వకంగా మెసేజ్‌లు చేశాడని, తర్వాత ఆ వ్యక్తే అకస్మాత్తుగా నగ్న ఫోటోలు పంపాలంటూ మెసేజ్ చేసినట్లు అక్షయ్ పేర్కొన్నారు. కానీ ఆ సమయంలో తన కుమార్తె చాలా తెలివిగా ప్రవర్తించి, చాకచక్యంగా తన ఫోన్‌ను స్విచాఫ్ చేసిందని, ఆ తర్వాత తల్లి వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పిందని అక్షయ్ గుర్తు చేశారు. తన కూతురు అలర్ట్‌గా ఉండడం వల్ల.. సైబర్ క్రిమినల్స్ బారినపడలేదన్నారు. రాష్ట్రంలోని 8వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు స్కూళ్లలో సైబర్ అవగాహనపై పాఠాలు బోధించేలా చూడాలని సీఎం ఫడ్నవీస్‌ను అక్షయ్ కోరారు.
ఆన్లైన్ గేమ్ ఆడుతున్న సమయంలో నువ్వెక్కడ ఉన్నావని అవతలి వ్యక్తి తొలుత ప్రశ్నించాడని, దానికి ముంబై నుంచి అని తన కూతురు సమాధానం ఇచ్చిందన్నారు. అయితే గేమ్ కొనసాగుతున్న సమయంలో.. ఆ వ్యక్తి అనేక సందేశాలు పంపాడన్నారు. ఆ తర్వాత కాసేపటికి అబ్బాయివా లేక అమ్మాయివా అని అడిగాడని, ఆ ప్రశ్నకు అమ్మాయి అని తన కూతురు సమాధానం ఇచ్చినట్లు అక్షయ్ తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఇలాగే జరుగుతుంటాయని, కానీ తన కూతురు తన భార్యతో మాట్లాడి మంచి పనిచేసిందన్నారు.
సైబర్ నేరాల్లో ఇది ముఖ్యమైందని, పిల్లలకు ఎరవేస్తుంటారని, కొన్ని కేసుల్లో బెదిరింపులకు పాల్పడుతారని, ఇలాంటివి చాలా జరుగుతుంటాయని, అనేక సందర్భాల్లో బాధితులు బలవన్మరణానికి పాల్పడే అవకాశాలు ఉన్నట్లు అక్షయ్ కుమార్ తెలిపారు. స్కూళ్లలో చరిత్ర, గణితం పాఠ్యాంశాలు బోధిస్తారని, రెండు రెండ్ల నాలుగు అవుతుందని, కానీ సైబర్ ప్రపంచంలో అది జీరో అవుతుందన్న విషయాన్ని స్కూల్ పిల్లలకు నేర్పాలన్నారు. సైబర్ సేఫ్టీ గురించి మహారాష్ట్ర స్కూళ్లలో ఏడు నుంచి 10 తరగతి పిల్లలకు పాఠాలు బోధించాలని సీఎంను కోరారు. వీధుల్లో జరిగే నేరం కన్నా.. సైబర్ క్రైం చాలా పెద్దదని అక్షయ్ అన్నారు.
#WATCH | Mumbai | Actor Akshay Kumar says, “I want to tell you all a small incident which happened at my house a few months back. My daughter was playing a video game, and there are some video games that you can play with someone. You are playing with an unknown stranger. While… pic.twitter.com/z9sV2c9yC6
— ANI (@ANI) October 3, 2025