Tejashwi Yadav : బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దూకుడు పెంచాయి. ఆర్జేడీ నేత (RJD leader) తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ప్రచార జోరును పెంచారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఆర్జేడీ నేత హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయడంలో సాధ్యాసాధ్యాలపై మీడియా ఆయనను ప్రశ్నించగా అందుకు తేజస్వీ బదులిచ్చారు.
తనకు వయస్సు లేకపోవచ్చుగానీ పరిణతి ఉందన్నారు. దాని ఆధారంగానే హామీ ఇచ్చానని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఆర్థిక న్యాయం, సమ్మిళిత వృద్ధితో బీహార్‌ను భారత్‌లోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో తాను ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలు ఉద్యోగాల కోసం, విద్యార్థులు కోచింగ్‌ల కోసం ఇళ్లు వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని తేజస్వి అన్నారు.
మూతబడిన జనపనార మిల్లుల పునరుద్ధరణ, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, ఐటీ పార్కులు, సెజ్‌ల అభివృద్ధి, బీహార్‌ను విద్యాకేంద్రంగా మార్చడం వంటి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు తేజస్వి తెలిపారు. అభివృద్ధి బీహార్‌లోని ప్రతి ఇంటి గుమ్మం ముందుకు చేరుకునేలా చర్యలు తీసుకుంటూ స్వయం సమృద్ధిగల రాష్ట్రాన్ని సృష్టిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయలేకపోయాయని విమర్శించారు.
తాము అధికారంలోకి వస్తే బీహార్‌ను పర్యాటకంగానూ అభివృద్ధి చేసి దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.