లక్నో: 2024 లోక్సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా దక్కలేదు. దీంతో ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి(Mayawati) అసహనం వ్యక్తం చేశారు. తమ పార్టీ ముస్లింలకు సరైన ప్రాతినిధ్యాన్ని కల్పించినా.. ముస్లిం వర్గం మాత్రం బీఎస్పీ పార్టీని అర్థం చేసుకోలేకపోయారని మాయావతి పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మాయావతి ఇవాళ తన ఎక్స్ అకౌంట్లో ఓ లేఖను రిలీజ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ముస్లిం వర్గానికి కల్పించే ప్రాతినిధ్యంపై సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ ఖాతా తెరవలేదు. అయితే 2019లో ఎస్పీతో పొత్తు పెట్టుకుని 10 సీట్లను గెలుచుకున్నది.
తాజా ఫలితాలపై లోతుగా అధ్యయనం చేయనున్నట్లు మాయావతి తన లేఖలో పేర్కొన్నారు. అయితే పార్టీకి ప్రయోజనం చేసే అంశాలపై నిర్ణయాలను తీసుకోనున్నట్లు ఆమె వెల్లడించారు. యూపీకి చెందిన దళిత వర్గం జాతవ్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కానీ ముస్లింలు వ్యవహరించిన తీరు పట్ల మాత్రం మాయావతి అసంతృప్తిని వ్యక్తం చేశారు. బీఎస్పీలో ముస్లిం సామాజిక వర్గం కీలకమైందని, కానీ ఆ పార్టీని సరైన రీతిలో ముస్లింలు అర్థం చేసుకోలేకపోయినట్లు ఆమె చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లిం వర్గానికి ఎంత వరకు అవకాశం ఇవ్వాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని, ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని మాయావతి తెలిపారు.
2024 ఎన్నికల్లో బీఎస్పీ మొత్తం 35 మంది ముస్లింలకు సీట్లు ఇచ్చింది. కానీ ఒక్కరు కూడా గెలుపొందలేదు. దేశ ప్రజాస్వామ్యం, ప్రయోజనాలు, రాజ్యాంగం గురించి భవిష్యత్తు నేతలు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. విపరీతమైన వేడి వాతావరణంలో సుదీర్ఘంగా ఎన్నికలు నిర్వహించడాన్ని ఆమె తప్పుపట్టారు. లోక్సభ ఎన్నికలను మూడు లేదా నాలుగు దశల్లో ముగించడం ఉత్తమం అవుతుందని ఆమె అన్నారు.
05-06-2024-BSP PRESS NOTE- LOK SABHA POLL RESULT REACTION pic.twitter.com/iUYELFPnCM
— Mayawati (@Mayawati) June 5, 2024