Murder : కేంద్ర మంత్రి (Union Minister) జితన్ రామ్ మాంఝీ (Jitan Ram Manzhi) మనుమరాలు 32 ఏళ్ల సుష్మా దేవి (Sushma Devi) బుధవారం దారుణ హత్యకు గురైంది. ఆమెను తన భర్త రమేశ్ సింగ్ కాల్చి చంపాడు. బీహార్లోని గయా జిల్లా టెటువా గ్రామం అటారీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందింతుడు రమేశ్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. మృతురాలు సుష్మాదేవి అటారీ బ్లాక్లో వికాస్ మిత్రాగా పనిచేస్తున్నారు. కొన్నాళ్లుగా ఆమెపై రమేశ్ కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఆమెను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి బంధించాడు. ఆ తర్వాత ఆమె ఛాతిపై కాల్చి పారిపోయాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మగధ్ ఆసుపత్రికి తరలించారు. సుష్మను ఆమె భర్తే కాల్చి చంపాడని, ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు. ఫోరెన్సిక్ టీమ్, టెక్నికల్ సెల్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నామని, నిందితుడిని వీలైనంత త్వరలోనే పట్టుకుంటామని గయా ఎస్ఎస్పీ ఆనంద్ కుమార్ చెప్పారు. సుష్మ మృతిపై ఆమె సోదరి పూనమ్ కుమారి విచారం వ్యక్తం చేశారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రమేశ్ సడెన్గా ఇంట్లోకి వచ్చి మా సోదరిని బలవంతంగా గదిలోకి తీసుకెళ్లాడని, ఆ తర్వాత ఆమెను కాల్చిచంపి పరారయ్యాడని తెలిపారు. అతడికి కఠిన శిక్ష పడాలని అన్నారు. కాగా సుష్మ, రమేశ్కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే ఆమెపై అనుమానంతో కొన్నాళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సుష్మ హత్య జరిగింది.