చండీగఢ్, అక్టోబర్ 16: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలుపుతున్న ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోని సింఘులో ఘోరం జరిగింది. లఖ్బీర్ సింగ్(35) అనే దళిత కార్మికుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. పదునైన కత్తితో ఒక చేతి మణికట్టును నరికేశారు. శరీరంలో పదిచోట్ల గాట్లు పెట్టారు. తర్వాత ఆ మృత దేహాన్ని రైతులు నిరసన తెలుపుతున్న ప్రధాన వేదిక దగ్గర ఉన్న పోలీసు బ్యారికేడ్కు వేలాడదీశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన రైతుల్లో తీవ్ర కలవరం రేపింది. హత్యపై సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) స్పందించింది. ఇది నిహంగ్ల పనేనని ఆరోపించింది. వారు రైతు ఉద్యమాన్ని నీరుగార్చడానికి మొదటి నుంచీ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నది. ఎస్కేఎం ఆరోపించినట్టుగానే.. హత్యకు పాల్పడింది తనేనంటూ సరవ్జిత్ సింగ్ అనే నిహంగ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సిక్కు మత గ్రంథాన్ని లఖ్బీర్ సింగ్ అపవిత్రం చేశాడని అందుకే చంపేశానని చెప్పాడు. కాగా, లఖ్బీర్ హత్య నేపథ్యంలో నిరసన కేంద్రాల వద్ద నిఘా, భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఎస్కేఎం నిర్ణయించింది. మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి శనివారం మరో ‘నిహంగ్’ను పోలీసులు అరెస్ట్ చేశారు.