Murder : ఓ వృద్ధుడు కోడలిని గొడ్డలితో నరికి చంపి తాను చెట్టుకు ఉరేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని షాజహాన్‌పూర్ జిల్లా (Shajahanpur district) లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. షాజహాన్‌పూర్ జిల్లా కాంట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హాతీపూర్ కురియా (Hathipur Kuria) గ్రామానికి చెందిన రాజ్‌పాల్ సత్య (70), సుమిత్ర (30) ఇద్దరూ మామాకోడళ్లు.
రాజ్‌పాల్ కొడుకు లారీ డ్రైవర్. విధి నిర్వహణలో భాగంగా అతడు ఎక్కువ సమయం ఇంటి దూరంగా ఉంటాడు. తండ్రి అతడి భార్యను చంపిన రోజు కూడా తను ఇంట్లో లేడు. అయితే రాజ్‌పాల్ నిత్యం తాగొచ్చి కోడలితో గొడవపడేవాడు. ఈ క్రమంలో మంగళవారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో రాజ్‌పాల్ ఇంట్లో దాచి ఉన్న గొడ్డలితో కోడలి మెడ నరికాడు. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం రాజ్‌పాల్ ఊరిబయట చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. తాగిన మైకంలో రాజ్‌పాల్ చేసిన గొడవే రెండు నిండు ప్రాణాలు పోవడానికి కారణమైందని స్థానికులు చెబుతున్నారు.