Mumtaz Ali : కర్ణాటకలోని మంగళూరు నియోజకవర్గంలో అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త బీఎం ముంతాజ్ అలీ (52) ఉదంతం విషాదాంతమైంది. ఫాల్గుణ నదిలో దాదాపు 12 గంటల గాలింపు అనంతరం కులూర్ వంతెన కింద ఆయన మృతదేహం లభ్యమైంది. ఆదివారం తెల్లవారుజామున కారులో ఇంటి నుంచి బయలుదేరిన ఆయన తిరిగి రాకపోవడం, ఉదయం కులూర్ వంతెనపైన ఆయన కారు పార్క్ చేసి ఉండటం, ఆ కారు ముందు భాగం డ్యామేజ్ అయ్యి ఉండటంతో.. కుటుంబసభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మంగళూరు మాజీ ఎమ్మెల్యే మెయిదీన్ బవ సోదరుడైన ముంతాజ్ ఆదివారం తెల్లవారుజామున తన కారులో ఇంటి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగిరాలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దాంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కులూరు వంతెన సమీపంలో ముంతాజ్ అలీకి చెందిన కారు ఉన్నట్లు సమాచారం వచ్చింది. దాంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులకు ఆయన ఆచూకీ దొరకలేదు.
దాంతో ఆయన నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానించారు. ఆ మేరకు ఫాల్గుణి నదిలిలో గాలింపు ఆపరేషన్ నిర్వహించారు. అలీ అదృశ్యంపై కావూరు పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. అతడిని డబ్బుల కోసం బెదిరించడం, బ్లాక్మెయిల్ చేసిన ఆరోపణలపై ఓ మహిళతోపాటు ఆరుగురిని నిందితులుగా పేర్కొన్నారు. సోమవారం అలీ మృతదేహాన్ని వెలికితీసినట్లు మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు.